ప్యాకేజీ ఓకే...
ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడాన్ని ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. ఈ ప్యాకేజీ రూ.11,440 కోట్లలో రూ.10,300 కోట్లు కొత్తగా ఈక్విటీగా మార్చడానికి, మిగిలిన రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్‌ను ప్రిఫరెన్షియల్ షేర్లుగా మార్చడానికి వినియోగించనున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్టీల్‌ప్లాంట్‌కు ప్రస్తుతం ఉన్న సుమారు రూ.25 వేల కోట్లు భారంలో ఈ ప్యాకేజీ ఎంత వరకు ఉపయోగపడుతుంది, ఈ ప్యాకేజీతో ఉద్యోగులకు, ఉద్యోగులకు చెందిన ఆర్థిక అంశాలకు ఎంత వరకు ప్రయోజనం చేకూరుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే రెండున్నర నెలల జీతం పెండింగ్‌లో ఉండగా సుమారు రూ.1000 కోట్లు పీఎఫ్ ట్రస్ట్, ఎస్‌బీఎఫ్ ట్రస్ట్, త్రిఫ్ట్ సొసైటీ, ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ తదితర సంస్థలకు చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు ఇటీవల యాజమాన్యం విడుదల చేసిన వీఆర్‌ఎస్ స్కీంకు అవసరమైన సొమ్ము ఈ ప్యాకేజీ నుంచి చెల్లిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్యాకేజీ ద్వారా స్టీల్‌ప్లాంట్ పూర్తి ఉత్పత్తి సామర్థ్యం సాధనకు వినియోగించడానికి అందరికీ ఆమోదయోగ్యమే కాని ఇది శాశ్వత పరిష్కారమవుతుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్యాకేజీ వల్ల తాత్కాలిక ఉపశమనమే కాని శాశ్వత పరిష్కారం కాదని కార్మిక నాయకులు అభిప్రాయపడుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించడం, సెయిల్‌లో విలీనం మాత్రమే శాశ్వత పరిష్కారమని చెబుతున్నారు.
సెయిల్‌లో విలీనంతోనే పూర్తి పరిష్కారం
కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడం పోరాట కమిటీ స్వాగతిస్తోంది. అయితే ఈ ప్యాకేజీ వల్ల పూర్తి పరిష్కారం లభించదు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయడం చాలా ముఖ్యమైన అంశం. అదే విధంగా ఈ ప్యాకేజీ ద్వారా కార్మికులకు రావాల్సిన అన్ని ప్రయోజనాలు వెంటనే కల్పించాలి.
– కె.ఎస్.ఎన్. రావు, కన్వీనర్, ఉక్కు పోరాట కమిటీ
పోరాట కమిటీ విజయం
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్ కమిటీ స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీప్రకటించడం పోరాట కమిటీ విజయం. ఈ ప్యాకేజీతో స్టీల్‌ప్లాంట్‌కు శాశ్వత పరిష్కారం కాదు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలి, సొంత గనులు కేటాయించాలి, రాష్ట్రపతి పేరిట ఉన్న భూములను విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మార్చాలి. అదే విధంగా కొత్త నియామకాలు చేపట్టాలి, నాలుగేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే కల్పించాలి.
– జె.అయోధ్యరామ్, కో–కన్వీనర్ ఉక్కు పోరాట కమిటీ
సొంత గనులు కేటాయించాలి
స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయిస్తేనే శాశ్వత పరిష్కారం అవుతుంది. సొంత గనులు లేకపోవడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోంది. ప్యాకేజీ ప్రకటించడం ఆమోదయోగ్యమే అయితే దీని ద్వారా ప్లాంట్‌కు ఏవిధంగా ఉపయోగపడుతుందో పరిశీలించాల్సి ఉంది. ఈ ప్యాకేజీ ద్వారా ప్లాంట్ పూర్తి ఉత్పత్తి సామర్థ్యం సాధించడంతో పాటు కార్మికుల ప్రయోజనాలు కాపాడతారని భావిస్తున్నాం.
– ఎం.వి. రమణమూర్తి, అధ్యక్షుడు, స్టీల్ ఐఎన్‌టీయూసీ
Comments
Please login to add a commentAdd a comment