ముసాయిదా సవరణలకు ప్రజాభిప్రాయ సేకరణ
విశాఖ సిటీ: సెక్యూర్టీ డిపాజిట్లు, విద్యుత్ సరఫరా లైసెన్స్ ఫీజు, ఇతర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్‌సీ) ముసాయిదా సవరణలకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు ఈఆర్‌సీ చైర్మన్ ఠాకూర్ రామ్‌సింగ్ పేర్కొన్నారు. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలకు సంబంధించిన ఆదాయ అవసరాలు, టారీఫ్‌ల పెంపు మీద ఈఆర్‌సీ రాష్ట్ర సలహా కమిటీ సమావేశాన్ని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కాలంలో చేపట్టిన సంస్కరణలు, నిర్ణయాలను వివరించారు. ప్రధానంగా సోలార్ రూఫ్‌టాప్, గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహానికి తీసుకున్న చర్యలను విశదీకరించారు. డిస్కంలు గుర్తించిన వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర సలహా కమిటీ సభ్యులు వాణిజ్య, పరిశ్రమలు, రవాణా, వ్యవసాయం, కార్మిక, వినియోగదారుల, ప్రభుత్వేతర సంస్థల విజ్ఞప్తులను ఈఆర్‌సీ దృష్టికి తీసుకువెళ్లారు. అదే విధంగా డిస్కంలకు ఆదాయ అవసరాలు, టారీఫ్ పెంపు వంటి విషయాలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఏపీఈఆర్‌సీ సభ్యుడు పి.వి.ఆర్.రెడ్డి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్, ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, ఏపీ ట్రాన్స్‌కో డైరెక్టర్(గ్రిడ్) ఎ.వి.కె.భాస్కర్, ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్(ఫైనాన్స్) రామ్‌దాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment