శ్రీలంకలో ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తాం
మహారాణిపేట: ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక సూత్రాలను అనుసరించడం ద్వారా రసాయనాలను ఉపయోగించకుండా వ్యవసాయం సాధ్య మని శ్రీలంక ప్రతినిధి బృందం, రైతులు తెలిపారు. రైతు సాధికార సంస్థ(ఆర్‌వైఎస్‌ఎస్) రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్(ఏపీసీఎన్‌ఎఫ్) నమూనా బృంద సభ్యులను ఆకట్టుకుంది. రాష్ట్రంలో 11 రోజుల పాటు పర్యటన పూర్తి చేసుకున్న శ్రీలంక ప్రతినిధి బృందం గురువారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తమ అనుభవాలను పంచుకుంది.
ఈ సందర్భంగా శ్రీలంక సర్వోదయ ఫౌండేషన్ ప్రతినిధి చమారి మాట్లాడుతూ రైతులు అమలు చేస్తున్న ఏటీఎం(ఎనీ టైం మనీ), ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏ గ్రేడ్ వంటి విభిన్న నమూనాల ద్వారా తాము చాలా అంశాలు నేర్చుకున్నట్లు తెలిపారు. కొంత మంది రైతులు తమ దేశంలో రసాయనాలు వాడుతున్నారని, ఇక్కడ ప్రకృతి వ్యవసాయ విధానంలో రసాయనాలు అవసరం లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయవచ్చని గ్రహించామన్నారు. శ్రీలంక దేశంలో కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేయడానికి ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్ర సందర్శనలను ఏర్పాటు చేసిన ఆర్‌వైఎస్‌ఎస్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ప్రియదర్శిని అనే మహిళ రైతు మాట్లాడుతూ ఏటీఎం మోడల్‌పై ఆసక్తి ఏర్పడిందన్నారు. శ్రీలంకలో నీరు ఎక్కువగా లభ్యమవుతుందని.. ఏటీఎం(ఎనీటైం మనీ) తక్కువ నీటితో కూడా అమలు చేయగలిగే విధానమన్నారు. అనంతపురం వంటి పొడి ప్రాంతాల్లో కూడా ఉపయోపడగేలా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ మోడల్‌ను శ్రీలంకలో విస్తరించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్ వర్చువల్‌గా సమావేశంలో పాల్గొని.. ప్రకృతి వ్యవసాయం ప్రారంభించేందుకు ఆసక్తి చూపించిన శ్రీలంక రైతులను అభినందించారు. రైతు సాధికార సంస్థ ప్రతినిధులు వి.కృష్ణారావు,హేమ సుందర్, ప్రకాష్‌రావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
ఏపీసీఎన్‌ఎఫ్‌ను మోడల్‌ను
అభినందించిన ఆ దేశ ప్రతినిధి బృందం
Comments
Please login to add a commentAdd a comment