రాజ్యాంగ ఉల్లంఘనే
ప్రశ్నించే గొంతును నొక్కేయడం
విజయనగరం: భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో గొప్పదని, అటువంటి గొప్ప రాజ్యాంగంలో పౌరులకోసం పొందుపరిచిన హక్కులను టీడీపీ కూటమి ప్రభుత్వం హరించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగ బద్ధంగా ప్రతి పౌరునికి ప్రశ్నించే హక్కు ఉందని, ప్రశ్నించే గొంతుకులను నొక్కేయడం అన్యాయమన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, మోసాలను ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇదేనా రాజ్యాంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే గౌరవమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులకు భంగం కులుగుతుందని, ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీల అమలు, పాలన పరమైన అంశాలపై ప్రశ్నించే వారిపై రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ పౌరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ విధానం మంచిది కాదని హితవుపలికారు. ప్రశ్నించే తత్వం పౌరుని ప్రాథమిక హక్కు అని, ప్రభుత్వం చేస్తున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ విధంగా మాట్లాడటం భాధాకరంగా ఉందన్నారు. ఇప్పటికై న రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలని కోరారు. జెడ్పీ కార్యాలయంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. జెడ్పీటీసీలు కెల్ల శ్రీనివాసరావు, వర్రి నర్సింహమూర్తి, పార్టీ నాయకులు నెక్కల నాయుడుబాబు, పీరుబండి జైహింద్ కుమార్, రేగాన శ్రీనివాసరావుతో పాటు కార్పొరేటర్లు జి.వి.రంగారావు, గాదం మురళి, మారోజు శ్రీనివాసరావు, పట్నాన పైడిరాజు, వింత ప్రభాకరరెడ్డి తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం జెడ్పీ ఉద్యోగులతో చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు భారత రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ దేశంలో వివిధ రకాల మతస్తులు, కులస్తులు ఉన్నా రాజ్యాంగ స్ఫూర్తితో అందరం భారతీయులమన్న ఏకభావంతో జీవిస్తున్నామన్నారు. అంబేడ్కర్ చూపించిన బాట గొప్పదని కొనియాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రాజ్యాంగాన్ని అనుసరించి పాలనపరమైన అంశాలను పారదర్శకతతో అమలుచేయాల్సి ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు
ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు
బనాయించడం దురదృష్టకరం
ప్రజాప్రతినిధులు రాజ్యాంగబద్ధంగా
నడుచుకోవాల్సిన అవసరం ఉంది
జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
జెడ్పీ కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment