రాజ్యాంగ బద్ధంగా పనిచేద్దాం
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: భారత రాజ్యాంగ కార్యనిర్వహణలో ఉద్యోగులది కీలక భూమికని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులందరూ రాజ్యాంగ బద్ధంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. భారతదేశంలో విభిన్న వర్గాలు, జాతులు, కులాలు, మతాలు ఉన్నప్పటికీ అందరూ ఒక్కటిగా ఉండేలా చేసే ఘనత మన రాజ్యాంగానిదేనని అన్నారు. ఎన్నో సవరణలు జరుపుకున్నప్పటికీ పీఠిక స్వరూపం మారలేదన్నారు. రాజ్యాంగం ముసాయిదా కమిటీ చైర్మన్‌గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వ్యవహరించారని, అందుకే ఆయన రాజ్యాంగ పితామహునిగా పేరొందారని తెలిపారు. తొలుత రాజ్యాంగ పరిరక్షణపై సామూహికంగా ప్రతిజ్ఞ చేశారు. డీఆర్వో ఎస్.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, సీపీఓ పి.బాలాజీ, ఆర్డీఓ డి.కీర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విశిష్టమైనది మన రాజ్యాంగం
సాక్షిప్రతినిధి, విజయనగరం: విశిష్టమైనది మన రాజ్యాంగమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.వి.రాజేష్‌కుమార్ అన్నారు. జిల్లా కోర్టు హాల్‌లో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఎంపీడీఓలు, ఈఓపీఆర్‌డీలు, పంచాయతీరాజ్ ఏఈలతో మంగళవారం తన చాంబర్ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం, వేతనదారులకు పని కల్పన, పశు శాలల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో మొత్తం 2,195 పనులు మంజూరు చేయగా ఇప్పటివరకు 2,157 పనులు ప్రారంభమైనట్టు వెల్లడించారు. మిగిలిన పనులను బుధవారంలోగా ప్రారంభించాలని, లేదంటే రద్దుచేస్తామని స్పష్టంచేశారు. పనుల బిల్లులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలన్నారు. మంజూరై పెండింగ్‌లో ఉన్న 434 పశుశాలల పనులను రెండు రోజుల్లో ప్రారంభించాలని చెప్పారు. పీఎం జన్‌మన్ కింద ఎంపిక చేసిన గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ ఎ.కళ్యాణచక్రవర్తి, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, పీఆర్ ఎస్‌ఈ ఎం. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
లాభసాటిగా ‘సాగు’దాం..
మెరకముడిదాం: పంటల సాగులో సూక్ష్మపోషకాల ఆవశ్యకతపై నైర వ్యవసాయ కళాశాల విద్యార్థినులు రైతులకు అవగాహన కల్పించారు. బైరిపురం గ్రామ రైతులకు వివిధ పంటల సాగు పద్ధతులను మంగళవారం వివరించారు. విత్తన శుద్ధి, పచ్చిరొట్ట ఎరువు, పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. చీడపీడల నివారణ పద్ధతులపై సూచనలు చేశారు. జింక్, బోరాన్ వంటి సూక్ష్మపోషకాలు భర్తీ చేసుకునే పద్ధతులను తెలియజేశారు. ఆధునిక సాగు పద్ధతులను అవలంభించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment