విజయనగరం అర్బన్:
వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 73 కేంద్ర పథకాలు ప్రారంభమయ్యాయని మరో 20 పథకాలు త్వరలో అమలు కానున్నాయని తెలిపారు. వాటిని జిల్లా అభివృద్ధికి అన్వయించడంలో నిర్లక్ష్యం వహించవద్దని తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఎంపీ మాట్లాడుతూ మార్పు కోసం అధికారులు, ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వ్యవసాయం, విద్యుత్, సమగ్ర శిక్ష, జాతీయ రహదారుల నిర్మాణం, వైద్యారోగ్యం, సీ్త్ర శిశు సంక్షేమం, పరిశ్రమలు, పశు సంవర్థకం, స్వచ్ఛ భారత్, జలజీవన్ మిషన్ తదితర పథకాలపై సమీక్షించారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకాన్ని జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కోళ్ల లతితకుమారి, లోకం మాధవి, జెడ్పీ సీఈఓ బీవీసత్యనారాయణ, డిప్యూటీ సీఈఓ ఆర్.వెంకటరామన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment