ఆంధ్ర మహిళా క్రికెట్ అండర్–19 జట్టుకు హారిక ఎంపిక
విజయనగరం అర్బన్: ఆంధ్ర రాష్ట మహిళా క్రికెట్ అండర్ – 19 జట్టుకు పట్టణానికి చెందిన శ్రీలక్ష్మి గణపతి డిగ్రీ కళాశాల బీకాం రెండో సంవత్సర విద్యార్థిని కోరుకొండ హారిక ఎంపికై ంది. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్‌బాబు నుంచి ఎంపిక ఆదేశాలు వచ్చాయని కళాశాల కరెస్పాండెంట్ వై.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 4న కేరళలో జరిగే వన్‌డే క్రికెట్ పోటీలలో పాల్గొనే ఆంధ్ర మహిళా క్రికెట్ అండర్–19 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో హారికను కళాశాల యాజమాన్యం, కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందించారు.
బడిగంట మోగాక సెలవు కబురు●
● ప్రహసనంగా హాజరు తంతు
విజయనగరం అర్బన్: తుఫాన్ కారణంగా రెండు రోజుల క్రితం నుంచి జిల్లాలో కురుస్తున్న వర్షాలు విద్యార్థుల, ఉపాధ్యాయుల రా కపోకలకు ఇబ్బందికరంగా ఉంటుందని భా వించిన జిల్లా యంత్రాంగం శనివారం సెలవు ప్రకటించింది. అయితే సకాలంలో ఆదేశాలు ఇవ్వకపోడం వల్ల సెలవు ఉద్దేశం నెరవేరలేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పలేదు. శనివారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. సెలవు ప్రకటిస్తారని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు ఎదురు చూసారు. సెలవు ప్రకటిస్తున్నట్లు ఉదయం 8.50 గంటలకు సెల్‌ఫోన్ ద్వారా సమాచారాన్ని జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఆ సమయానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు విధిగా హాజరై ప్రార్ధన ప్రక్రియలో ఉన్నారు. తరగతి గదుల్లోకి విద్యార్థులు వెళ్లి హాజరు తీసుకున్న తరువాత సెలవు సమాచారాన్ని ఉపాధ్యాయులు తెలుసుకున్నారు. అప్పుడే ఉత్సాహంగా స్కూళ్లకు వచ్చిన పిల్లల్ని ఇంటికి పంపలేక, జిల్లా యంత్రాంగం సెలవు ఆదేశాలను పాటించలేక మధ్యాహ్నం భోజనం వరకు ఉంచి రెండో పూట పాఠశాల నిర్వాహకులు సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు కూడా ప్రహసనంగా మారింది. జిల్లా యంత్రాంగం ప్రకటించిన మేరకు సెలవు దినమా? లేక ఒక పూట విధులు నిర్వహించినందున హాఫ్ డే పని దినమా? తేలక హాజరు తంతు ప్రహసనంగా మారింది.
గంజాయి వ్యాపారుల నుంచి ఆస్తులు కొనుగోలు చేయొద్దు
● విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి
విజయనగరం క్రైమ్: గంజాయి వ్యాపారం ద్వారా ఆస్తులు కూడబెట్టిన వ్యక్తుల నుంచి ఎవరూ ఆస్తులు కొనుగోలు చేయవద్దని ప్రజలకు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అక్రమ వ్యాపారాలతో కూడబెట్టిన ఆస్తులను, వారి నుంచి తిరిగి ఎవరైనా కొనుగోలు చేస్తే చట్టపరమైన చిక్కులు తప్పవని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయం, అమ్మకాలు నిర్వహించి, ఆస్తులు కూడబెడితే వాటిని సీజ్ లేదా జప్తు చేసేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతుందన్నారు. రేంజ్ పరిధిలో ఇటువంటి అక్రమ వ్యాపారాలకు పాల్పడిన వ్యక్తులను ఇప్పటికే గుర్తించామని, వారి ఆస్తులను సీజ్ చేసేందుకు చట్టపరమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు ఏమైనా నూతనంగా ఆస్తులు కొనుగోలు చేసే ముందు సదరు విక్రయదారులు ఆయా ఆస్తులు ఏ విధంగా సంక్రమించాయి, వాటి చట్టపరమైన స్ధితిని ముందుగా ధ్రువీకరించుకోవాలన్నారు. లేకుంటే కొనుగోలుదారులు చట్టపరమైన, ఆర్థికపరమైన సమస్యల్లో చిక్కుకుపోతారన్నారు. అటువంటి ఆస్తులతో కూడిన లావాదేవీలతో కొనుగోలుదారులకు చట్టపరమైన తీవ్ర పరిణామాలు తప్పవని సూచించారు. ఇదేరకంగా అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలానికి చెందిన పడాల నాగేశ్వరరావు అనే వ్యక్తి దశాబ్ద కాలంగా గంజాయి వ్యాపారం సాగించి, తన పేరున, భార్య పేరున 15.36 ఎకరాల భూములు కొనుగోలు చేశారని, సదరు భూమి విలువ రూ.62.80 లక్షలు ఉంటుందని విచారణలో వెల్లడైందన్నారు. ఈ ఆదాయం అక్రమ సంపాదనగానే గుర్తించడం జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment