చంద్రబాబు పాలనలోనే...గిరిజన ప్రాంతాలకు గ్రహణం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలోనే...గిరిజన ప్రాంతాలకు గ్రహణం

Published Sun, Dec 22 2024 1:25 AM | Last Updated on Sun, Dec 22 2024 1:25 AM

చంద్రబాబు పాలనలోనే...గిరిజన ప్రాంతాలకు గ్రహణం

చంద్రబాబు పాలనలోనే...గిరిజన ప్రాంతాలకు గ్రహణం

అభిమానుల మాట వింటారా?

పర్యటనలో జనసైనికులేమో పవన్‌ కళ్యాణ్‌ను సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారని, ఆయనేమో చంద్రబాబు మరో రెండు పర్యాయాలు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారని రాజన్నదొర ఎద్దేవా చేశారు. చంద్రబాబే సీఎంగా ఉండాలంటూ పదేపదే చెబుతున్న పవన్‌ కళ్యాణ్‌... తన అభిమానుల మాట మన్నించి ఎప్పుడు సీఎం అవుతారని ప్రశ్నించారు.

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించినది తెలుగుదేశం పార్టీయేనని, అందులోనూ నాలుగు దఫాలుగా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిందీ చంద్రబాబు మాత్రమేనని, అంత అనుభవకాలంలో ఏ ఒక్క గిరిశిఖర గ్రామానికై నా రోడ్డు వేశారా? అని ఆయనను ప్రశ్నించాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు పీడిక రాజన్నదొర హితవు పలికారు. సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకులే ఎక్కువ కాలం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ప్రస్తుత ఎమ్మెల్యే రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమశాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా ఎమ్మెల్సీగా ఆరేళ్లపాటు పదవిని అనుభవించారని, మరి వారు ఏ ప్రాంతానికి రోడ్డు వేయించారో ఒక్కసారి అడిగితే పవన్‌కు తెలిసేదని అన్నారు. సాలూరు నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించి పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై రాజన్నదొర తీవ్రంగా స్పందించారు. శనివారం సాలూరులోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాటల్లోనే...

● ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్‌ కళ్యాణ్‌ గిరిజన ప్రాంతానికి రావడాన్ని ఒక గిరిజన నాయకుడిగా తాను స్వాగతిస్తాను. కానీ గతమేమిటో, గిరిశిఖర గ్రామాల్లో అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో తెలుసుకోకుండా రాజకీయాల కోసం ఏవేవో మాట్లాడితే మాత్రం కచ్చితంగా ఖండిస్తాను.

● గత పాలకులు ఏజెన్సీలో గిరిశిఖర ప్రాంతాలకు రోడ్లు వేయలేదని మాట్లాడటం పూర్తిగా అసంబద్ధం. సాలూరు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతంలో కొటియా గ్రామాలకు మొట్టమొదట బీటీ రోడ్డును తాను ఎమ్మెల్యేగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఒప్పించి నిర్మాణం చేయించాను. తర్వాత మళ్లీ ఆయన కుమారుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 11 బీటీ రోడ్లు, ఎనిమిది భారీ వంతెనలను మంజూరుచేయించాను. వాటిలో చాలావరకూ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని, తద్వారా గిరిజన గ్రామాలకు మైదాన ప్రాంతంతో అనుసంధానం ఏర్పడింది. గిరిజనులకు ప్రయాణ, వైద్య సౌకర్యం ఎంతో మెరుగుపడింది.

● గిరిజన ప్రాంతాలకు గత పాలకులు రోడ్డు వేయలేదని మొసలికన్నీరు కార్చడం సరికాదు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఒక్క రోడ్డు అయినా నిర్మించారా అని ప్రశ్నించాలి.

● సాలూరు మండలంలోని సిరివర గ్రామానికి చెందిన ఓ గిరిజన గర్భిణి ప్రసవ వేదనపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ సుమోటాగా స్పందించి నోటీసులు పంపించినప్పుడు అధికారంలో ఉన్నది కూడా టీడీపీయే. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నది కూడా చంద్రబాబు. నాడు హడావిడిగా రూ.8 కోట్లతో రోడ్డు మంజూరుచేస్తున్నట్లు టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తీరా 2019లో దిగిపోయేనాటికి కూడా నిధులు మంజూరుచేయకుండా గిరిజనులను మోసం చేశారు. అలా ఎందుకు చేశావని చంద్రబాబునే పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించాలి.

● సాలూరు నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నడిచివెళ్లిన బాగుజోల గ్రామానికి మట్టి రోడ్డు వేయించిందీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. సిరివర రోడ్డుకు, కొదమకు అటవీ ప్రాంతంలో కొండలు, గుట్టలు తొలిచి మట్టి రోడ్డు వేయించాం. చిలకమెండంగి రోడ్డుకు కూడా కేంద్రానికి పోలీసు అధికారుల ద్వారా నివేదికలు పంపించి పీఎంజేఎస్‌వై నిధుల కోసం ప్రయత్నాలు చేశాను. ఆ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి.

గిరిజనులను అడిగితే చెప్పేవారు...

గిరిజన ప్రాంతాలకు గత పాలకులు ఎవ్వరూ రాలేదని, తానే కాలినడకన వచ్చానని పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడటాన్ని రాజన్నదొర తప్పుబట్టారు. చిలకమెండంగి, బాగుజోల తదితర గిరిశిఖర, గిరిజన గ్రామాలకు తాను కాలినడకన వెళ్లి అక్కడి గిరిజనులతో మాట్లాడి ఎన్నో సమస్యలు పరిష్కరించానని గుర్తు చేశారు. గత ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాజన్నదొర ఇక్కడకు ఎప్పుడైనా వచ్చారా అని గిరిజనులను పవన్‌ కళ్యాణ్‌ అడిగి ఉంటే వారు వాస్తవమేమిటో చెప్పేవారన్నారు. అలాగాకుండా ఇక్కడకు గత పాలకులెవరైనా వచ్చారా? అంటే... లేదు లేదు అని చెప్పండంటూ మంత్రి సంధ్యారాణి సిగ్గులేకుండా గిరిజనులకు సైగ చేసి చేతులు ఊపించారని చెప్పారు. ఆమె ఎన్నిసార్లు వెళ్లారో పవన్‌ కళ్యాణ్‌ అడిగి ఉండాల్సిందన్నారు. 2014–19 కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సంధ్యారాణి కూడా ఎమ్మెల్సీ అయ్యారని, ఆ సమయంలో ఈ గిరిశిఖర గ్రామాలకు ఒక్క రోడ్డు అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నిస్తే బాగుండేదన్నారు. కనీసం ఇప్పుడైనా పవన్‌ కళ్యాణ్‌ తాను గిరిజనులకు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి ఆచరణలోకి తేవాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువకాలం టీడీపీదే ఏలుబడి

రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించింది చంద్రబాబే

ఏ ఒక్క గిరిశిఖర గ్రామానికై నా రోడ్డువేశారేమో ఆయన్ను ప్రశ్నించండి

ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు

మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర హితోపదేశం

గిరిశిఖర గ్రామాలకు వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి పాలనలోనే రోడ్లు

పవన్‌ నడిచిన మట్టిరోడ్డూ వేసిందీ వైఎస్సార్‌సీపీ హయాంలోనేనని

స్పష్టీకరణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement