నమ్మకం కలిగించే పాలన అవసరం
విజయనగరం రూరల్: ప్రభుత్వం ఏదైనా అది ప్రజలకు అండగా ఉంటూ నమ్మకం కలిగించాలే తప్ప ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పాలన ఉండరాదని ఉమ్మడి విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో పెన్షన్ల తొలగింపు, తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతన్నలను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన స్థాయీ సంఘ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ముందుగా 3వ స్థాయీ సంఘ సమావేశం వైస్ చైర్మన్ బాపూజీనాయుడు అధ్యక్షతన, 4వ స్థాయీ సంఘ సమావేశం సింహాచలం అధ్యక్షతన జరిగాయి. ఆయా సంఘాల్లోని వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో చర్చించారు.
పెన్షన్లు తొలగించబోమని భరోసా ఇవ్వాలి
ఇటీవల పెన్షన్ల తొలగింపుపై వస్తున్న ఆరోపణలపై డీఆర్‌డీఏ జిల్లా అధికారులతో చర్చసాగింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని చైర్మన్ వారిని కోరగా జిల్లాలో పింఛన్లు తొలగించాలని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం అందలేదని, జిల్లాలో పూసపాటిరేగ మండలం వెల్దూరు గ్రామంలో మాత్రం పెన్సన్ పంపిణీపై సర్వే చేపట్టామన్నారు. దాని తరువాత మళ్లీ యథావిధిగానే పెన్షన్లు పంపిణీ చేసినట్టు పీడీ తెలిపారు. బాడంగి జెడ్పీటీసీ సభ్యుడు మాట్లాడుతూ నూతన పెన్షన్లు ఇప్పటివరకూ మంజూరుకాలేదని, కొంతమందికి ఆన్‌లైన్‌లో చూపుతున్నాయే తప్ప మంజూరు కాలేదని సభ దృష్టికి తెచ్చారు. దీనిపై అధికారులు సమాధానమిస్తూ కొత్త ప్రభు త్వం వచ్చాక కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు. నవంబర్ నెల నుంచి భర్తను కోల్పోయిన వితంతువులకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్ వచ్చాయన్నారు.
ఎస్సీ, బీసీ, గిరిజన కార్పొరేషన్ నుంచి సాయం శూన్యం
ఎస్సీ, బీసీ, గిరిజన కార్పొరేషన్ల నుంచి అర్హులకు ఎలాంటి సాయం అందించారో చెప్పాలని సబంధిత అధికారులను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించగా... యాక్షన్ ప్లాన్ వచ్చిందే తప్ప ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందించాలని గైడ్‌లైన్స్ రాలేదని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారని, వారికి అండగా స్వయం ఉపాధి కోసం రుణాలు అందజేసేందుకు ప్రభుత్వం చొరవ చూపకపోవడంపై జెడ్పీ చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి యువతను ఆదుకునేలా చూడాలన్నారు.
● ఆర్‌డబ్ల్యూస్ అధికారులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన అసంపూర్తిగా ఉన్న జల్‌జీవన్‌మిషన్ (జేజేఎం) పనుల్లో కొన్నింటిని రద్దుచేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందన్నారు. ఇప్పటివరకు నూతన పనులు ప్రారంభించలేదని, పాతవాటిని పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, రెండు జిల్లాల జెడ్పీటీసీలు, అధికారులు, కమిటీ మెంబర్లు, జెడ్పీ సిబ్బంది పాల్గొన్నారు.
రైతులను ఆదుకోండి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం వల్ల పంటలను నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ధాన్యం తడిసిపోయినా ఎలాంటి పరిహారం అందజేయకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. పంట నష్టం వివరాలు నమోదు చేయాలని కోరారు. గజపతినగరం జెడ్పీటీసీ సభ్యుడు గార తవుడు మాట్లాడుతూ గ్రామాల్లో మినీ గోకులాలను అధికార పార్టీ నేతలు చెప్పినవారికే ఇస్తున్నారని, వాటి నిబంధనలు ఏమిటో, ఎవరు అర్హులో తెలియజేయాలని కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ అనర్హులకు మంజూరు చేసినట్టు మా దృష్టికి తెస్తే పరిశీలించి రద్దుచేస్తామన్నారు. ఆవులకు బీమా చేసిన వారికి మాత్రమే గోకులాలు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా వరి, మొక్కజొన్న పంటలకు కేవలం ఆరువేల మంది రైతులే బీమా ప్రీమియం చెల్లించినట్టు జామి జెడ్పీటీసీ సభ్యురాలు గొర్లె సరయు ప్రశ్నకు వ్యవసాయ అధికారులు సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం అమలుచేసి రైతులకు ప్రయోజనం కల్పించిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రయోజనాన్ని తొలగించడంపై పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.
పెన్షన్ల తొలగింపుపై స్పష్టత ఇవ్వండి
తుఫాన్ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ఎస్సీ, ఎస్టీ, గిరిజన కార్పొరేషన్ల నుంచి కానరాని భరోసా
జెడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో పలు అంశాలను చర్చించిన జెడ్పీ చైర్మన్
మజ్జి శ్రీనువాసరావు
Comments
Please login to add a commentAdd a comment