పట్టపగలే దోచేస్తారు.. జాగ్రత్త..!
● తీరుమారిన దొంగతనాల జోరు
● నెలల తరబడి రెక్కీ నిర్వహించి చోరీ
● అదును చూసి ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్న వైనం
● ఇటీవల కాలంలో పెరిగిన పగటి దొంగతనాలు
● ఎల్‌హెచ్‌ఎమ్‌ఎస్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి:
ఎస్పీ వకుల్ జిందల్
విజయనగరం క్రైమ్:
దొంగతనాల తీరు మారింది. అర్ధరాత్రో, వేకువజామునో ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని చూసి.. దొంగలు ఇళ్లల్లోకి చొరబడేవారు. ఇప్పుడంత ఓపిక వారికి లేకుండా పోయింది. ఒకే కుటుంబానికి చెందిన వారందరూ ఒకేసారి పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడం, అదును చూసి ఇంట్లోకి చొరబడి దోచేస్తున్నారు. దొంగతనాలకు పాల్పడే వారందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారే కావడం గమనార్హం. గుంపులుగా వచ్చి నెలల కొద్దీ జిల్లా అంతటా తిరగడం, దొంగతనం చేసిన తర్వాత అందరూ ఒకేసారి కనపడకుండా వేరే జిల్లాలకు మకాంమార్చేస్తున్నారు. ఇటువంటి దొంగలు ఇప్పుడు జిల్లాలో సంచరిస్తున్నారని, జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో వరస సంఘటనలు చోటుచేసుకోవడంతో జిల్లా పోలీస్‌శాఖ సైతం అప్రమత్తమైంది. స్వల్పకాలంలోనే నిందితులను పట్టుకుని అరెస్టులు చేసి రిమాండ్‌కు తరలించింది.
● చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం
జిల్లాలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడిపందాలు, పేకాటలు, ఇతర జూద క్రీడల నిర్వహణపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ఎస్పీ వకుల్‌జిందల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి పండగ పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా జిల్లా పోలీసులతో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటుచేశామన్నారు. గ్రామశివారు ప్రాంతాల్లో డ్రోన్స్‌తో నిఘా పెట్టామన్నారు. ఇటీవల కాలంలో అక్రమంగా మద్యం విక్రయించేవారిపై కేసులు నమోదుచేశామని పేర్కొన్నారు. బొబ్బిలి మండలం దిబ్బగుడ్డివలస గ్రామశివార్లలో పేకాట ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించి ఐదుగురుని అరెస్టు చేశామని, వారి నుంచి రూ. 35,200లు, నాలుగు మొబైల్‌పోన్‌లను సీజ్ చేశామన్నారు. డెంకాడ మండలం గొలగాం గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై దాడులు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.15,100 నగదు, మూడు బైక్‌లు, డెంకాడ మండలం చొల్లంగిపేట గ్రామ రచ్చబండ వద్ద పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని రూ.5,250 నగదు సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. గజపతినగరం మండలంలో కోడిపందాలు నిర్వహిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.8,100 నగదు, రెండు కోడిపుంజులు సీజ్ చేశామన్నారు. బొండపల్లి మండలంలో కోడిపందాలు ఆడుతున్న వారిపై పోలీసులు రైడ్ చేసి, కోడిపందాలు ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ. 8,900 నగదు, ఆరు కోడిపుంజులు సీజ్ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment