పోలమాంబ అరుదెంచిన వేళ..
మక్కువ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పోలమాంబ అరుదెంచిన వేళ భక్తలోకం పులకించింది. శంబర గ్రామం భక్తులతో పోటెత్తింది. అమ్మకు భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికింది. మంగళవాయిద్యాలు, తప్పెటగుళ్లు, కోలాట ప్రదర్శనల నడుమ గ్రామానికి ఆహ్వానించింది. దారిపొడవునా అమ్మవారి ఘటాలకు పూజలు చేసింది. సోమవారం రాత్రి 8గంటల ప్రాంతంలో గోముఖి నదిఒడ్డున పూజారి కుటుంబీకులు, రెవిన్నాయుడు, పూడి, కుప్పిలి వారి కుటుంబీకులు, ఆశాదీలు, దేవదాయశాఖ సిబ్బంది అమ్మవారి ఘటాలకు పూజలు చేశారు. అమ్మవారి ఘటాలకు భక్తులు ఎదురెళ్లి పసుపు, కుంకుమలు సమర్పించారు. రాత్రి 10.30 గంటల సమయంలో అమ్మవారిని చదురుగుడికి చేర్చారు. మంగళవారం విశ్రాంతి తీసుకొని, బుధవారం నుంచి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. గ్రామంలోని చదురుగుడిలో 13 రోజులపాటు ఉదయం వేళలో భక్తులకు దర్శనమిస్తూ, సాయంత్రం వేళ గ్రామంలోని అన్ని పురవీధులలో తిరువీధి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నెల 27న తొలేళ్ల ఉత్సవం, 28న సిరిమానోత్సవం, 29న అనుపోత్సవం నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఈఓ వి.వి.సూర్యనారాయణ, మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్లు, గ్రామ పెద్దలు, దేవదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment