కన్నీటి వీడ్కోలు
ప్రజల మనిషి రాజశేఖరం
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన పాలవలస రాజశేఖరం ప్రజల మనిషిగా చరిత్రలో నిలిచిపోయారని శాసన మండలి విపక్షనేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. రాజశేఖరం అంతిమయాత్రలో పాల్గొని భార్య ఇందుమతి, కుమారుడు విక్రాంత్, కుమార్తె రెడ్డి శాంతిలను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పాలవలస రాజశేఖరం సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి శ్రీకాకుళం డీసీసీబీ చైర్మన్‌గా, జెడ్పీ చైర్మన్‌గా పలుమార్లు పదవులు చేపట్టి శ్రీకాకుళం అభివృద్ధిలో ముఖ్యభూమిక పోషించారన్నారు. ఉణుకూరు ఎమ్మెల్యేగా, తర్వాత రాజ్యసభ సభ్యులుగా ఇలా ఎన్నో రాజకీయ పదవులు చేపట్టి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారన్నారు. రాజశేఖరం మృతితో ఓ రాజకీయశకం ముగిసిందన్నారు. ఆయన మరణం వైఎస్సార్‌సీపీకి తీరని లోటన్నారు. వీరఘట్టం–వంగర మండలాల ప్రజల చిరకాలవాంఛ కిమ్మి–రుషింగి వంతెన సాధనకు రాజశేఖరం ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కల్పించి ఆర్థిక వెలుగులు నింపారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. ఆయనతో పాటు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, తలే రాజేష్, డోల జగన్ తదితరులు ఉన్నారు.
● పాలకొండలోని నాగావళి నదీతీరంలో పాలవలస రాజశేఖరం అంత్యక్రియలు
● అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు,
రాజకీయ ప్రముఖులు
పాలకొండ/వీరఘట్టం:
రాజకీయ కురువృద్ధుడు, విలువలతో కూడిన రాజకీయాలకు మారుపేరుగా నిలిచి, విశ్వాసంతో ప్రజల మనసు గెలుచుకున్న పాలవలస రాజశేఖరం (81) అంతిమ వీడ్కోలు పాలకొండలో బుధవారం నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, అధికార పార్టీ నాయకుల కన్నీటి నివాళుల నడుమ అంతిమ యాత్ర కొనసాగింది. పాలకొండలోని రాజశేఖరం ఇంటి నుంచి పార్థివదేహాన్ని అంపిలి గ్రామ సమీపంలోని నాగావళి నదీ తీరానికి తరలించి అంతిమ సంస్కారాలను సంప్రదాయబద్ధంగా జరిపారు. ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తలకొరివి పెట్టగా, కుమార్తె రెడ్డి శాంతి, కుటుంబ సభ్యులు పార్థివదేహం చుట్టూ ప్రదక్షిణ చేసి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.
● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
రాజశేఖరానిది పెద్ద కుటుంబం. కుమారుడు, కుమార్తె, తమ్ముడు, వారి పిల్లలు, మనుమలు, కోడళ్లు ఇలా సుమారు 60 మంది సభ్యులు రాజశేఖరం భౌతిక కాయం వద్ద భోరున విలపించారు. రాజశేఖరం భార్య ఇందుమతి, కుమార్తె రెడ్డిశాంతి గుండెలవిసేలా రోదించారు. ఇది స్థానికులను కంటతడి పెట్టించింది. అజాత శత్రువుగా పేరొందిన రాజశేఖరం పార్ధివ దేహాన్ని కడసారి చూసేందుకు వచ్చిన ప్రజలు, రాజకీయ ప్రముఖులు, బంధువులు, ప్రజా సంఘాల నాయకులు, అధికారులతో పాలకొండ జనసంద్రంగా మారింది. అంత్యక్రియల్లో పాల్గొని రాజశేఖరం అమర్ రహే అంటూ రాజశేఖరం భౌతిక కాయాన్ని శ్మశాన వాటికకు తరలించారు.
● తరలివచ్చిన నాయకులు, అధికారులు....
పాలవలస రాజశేఖరం మరణవార్త విన్నప్పటి నుంచి గత 48 గంటలుగా పాలకొండకు రాజకీయ ప్రముఖుల తాకిడి ఎక్కువైంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ తదితరులు మంగళవారం రాజశేఖరం భౌతిక కాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, దువ్వాడ శ్రీనివాస్, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, అరకు ఎంపీ గుమ్మడి తనూజారాణి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, గొర్లె కిరణ్‌కుమార్, శంబంగి వెంకట చినప్పలనాయుడు, వైఎస్సార్‌సీపీ రాజాం నియోజకవర్గ కన్వీనర్ తలే రాజేష్, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని, డోల జగన్, గొండు కృష్ణమూర్తితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు, కాపు సామాజిక వర్గం ముఖ్యనేతలు ఈ అంతిమ యాత్రలో పాల్గొని రాజశేఖరం భౌతిక కాయానికి బుధవారం నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, పల్లా కొండబాబులు విక్రాంత్‌ను పరామర్శించారు.
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
భారీ బందోబస్తు....
రాజశేఖరం భౌతిక కాయాన్ని చూసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు, నాయకులు తరలిరావడంతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ సమస్య, శాంతి భధ్రతలకు విఘాతం కలగకుండా పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, సీఐ ఎం.చంద్రమౌళి ఆధ్వర్యంలో గట్టిపోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment