పండగ ఖర్చు రూ.120 కోట్లు
● గతేడాది కంటే రూ.30 కోట్లు తక్కువ
విజయనగరం ఫోర్ట్: సంక్రాంతి పండగకు జిల్లా ప్రజలు సుమారు రూ.120 కోట్లు వరకు ఖర్చుచేసినట్టు మార్కెట్ వర్గాల అంచనా. గతేడాది కంటే ఈ ఏడాది రూ.30 కోట్లు వరకు ఖర్చు తగ్గింది. వస్త్రాలకు రూ.70కోట్లు, మద్యంకు రూ.20కోట్లు, నిత్యావసర సరుకుల కొనుగోలుకు రూ.25కోట్లు, మాంసం, చేపలు, రొయ్యల కొనుగోళ్లకు రూ.5 కోట్లు వరకు ఖర్చుచేసినట్టు సమాచారం. వరుస తుఫాన్లతో రైతన్నలు పంటలు నష్టపోవడం, పిల్లల ఫీజుల భారం వంటివి పండగ సందడిలేకుండా చేశా యి. ప్రభుత్వం నుంచి మహిళలకు ఆర్థిక ‘చేయూత’ అందకపోవడంతో సంక్రాంతికి పొదుపుగా ఖర్చుచేశారు. కొందరు అప్పుచేసి పండగకు కావాల్సిన సామగ్రిని మాత్రమే సమకూర్చుకున్నారు. వస్త్ర, బంగారు వ్యాపారాలు గణనీయంగా తగ్గాయి.
వైఎస్సార్‌సీపీలో సంస్థాగత నియామకాలు
● జిల్లా యువజన విభాగం
అధ్యక్షుడిగా శ్రీకాంత్
బొబ్బిలి: వైఎస్సార్‌సీపీ పలు అనుబంధ విభాగాలకు జిల్లా అధ్యక్షులను నియమిస్తూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ కేంద్రకార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయా విభాగాల అధ్యక్షులంతా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలనూ కలుపుకుని పోతూ పార్టీ పటిష్టతకు కృషిచేయాలని కోరారు.
కోడి రామ్మూర్తి జీవితం ఆదర్శనీయం
● బౌద్ధ భిక్షువు బోధిహీన్ ●
వీరఘట్టం: కళియుగ భీముడు, ఇండియన్ హెక్క్యులెస్, మల్లమార్తాండ కోడి రామ్మూర్తినాయుడు జీవితం ఎందరికో ఆదర్శమని బౌద్ధ భిక్షువు బోధిహీన్ అన్నారు. శ్రీలంక నుంచి వీరఘట్టం వచ్చిన ఆయన వీరఘట్టం తెలగవీధిలో ఉన్న కోడి రామ్మూర్తినాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రామ్మూర్తినాయుడు జన్మించిన ఇంటిని, తిరిగాడిన ప్రదేశాలను సందర్శించారు. ఇటువంటి మహానుభావునికి నివాళులు అర్పించుకోవడం ఎంతో అదృష్టమన్నారు. వీరఘట్టం మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద, బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఉన్న రామ్మూర్తినాయుడు విగ్రహాలను సందర్శించారు. ఆయనతో పాటు స్థానికులు ఇట్లా మన్మధరావు, దౌలూరు సత్యారావు, కోడి తాతబాబు, బల్లా హరిబాబు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment