ముఫ్పై ఏళ్ల ఆదాయం: పామాయిల్‌తో సాధ్యం | - | Sakshi
Sakshi News home page

ముఫ్పై ఏళ్ల ఆదాయం: పామాయిల్‌తో సాధ్యం

Published Fri, Jan 17 2025 12:22 AM | Last Updated on Fri, Jan 17 2025 12:22 AM

ముఫ్పై ఏళ్ల ఆదాయం: పామాయిల్‌తో సాధ్యం

ముఫ్పై ఏళ్ల ఆదాయం: పామాయిల్‌తో సాధ్యం

ఆయిల్‌పామ్‌కు ప్రత్యేక రాయితీలు

ఉద్యానవన శాఖ ద్వారా విస్తరణ

పామాయిల్‌ తోటల్లో అంతర పంటలకు ప్రోత్సాహం

జిల్లాలో 6.4వేల హెక్టార్లలో సాగు

మన్యం జిల్లాలో 2.5 వేల హెక్టార్లలో సాగు పెంపు లక్ష్యం

భామిని: రోజుకురోజుకు పెరుగుతున్న నూనె వాడకానికి తగ్గట్లు నూనె గింజల పంటల ఉత్పత్తి పెరగడం లేదు. విదేశాల నుంచి నూనె గింజల దిగుబడిని తగ్గించడానికి స్థానిక రైతుకు ఆదాయం పెంచడానికి అనువుగా పామాయిల్‌ సాగుకు ప్రోత్సాహం పెరుగుతోంది. ముఫ్పై ఏళ్ల ఆదాయం వచ్చే అనువైన పంటగా ఆయిల్‌పామ్‌ను అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఆరోగ్యం కలిగించే ఆయిల్‌పామ్‌ సాగు రైతుల ఆదాయాన్ని పెంచుతోంది. అత్యధిక నూనె దిగుబడి ఇచ్చే పంటల్లో ఒకటి పామాయిల్‌. హెక్టారుకు 20 టన్నుల గెలల దిగుబడి వస్తుంది. అలాంటి ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రభుత్వాలు కూడా ప్రత్యేక రాయితీలను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 6.4వేల హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నారు. 2024–25వ సంవత్సరానికి మరో 2.5వేల హెక్టార్లలో సాగు పెంపు లక్ష్యంగా కార్యాచరణ చేపట్టారు.

జిల్లాలో నేషనల్‌ మిషన్‌ ఫర్‌ ఆయిల్‌పామ్‌ ద్వారా ప్రభుత్వం రైతులకు లబ్ధి చేకూరుస్తోంది. ఉద్యానవన శాఖ ద్వారా రైతులకు శ్రీనివాస ఆయిల్‌ పామ్‌ కంపెనీ మొక్కలు పంపిణీ చేస్తోంది. ఈ మొక్కలు ఎకరా విస్తీర్ణంలో త్రిభుజాకారంలో 57 నాటుతారు. నీటి వసతి బోరు, గెడ్డ, నీటి కాలువ సౌకర్యం ఉన్న రైతులకు మొక్కలు మంజూరు చేస్తారు. జిల్లాలో పండించే పామాయిల్‌ పంటను నేరుగా శ్రీనివాస పామ్‌ ఆయిల్‌ కంపెనీ వారే రైతు దగ్గరకు స్వయంగా వచ్చి కొనుగోలు చేస్తారు. పంట రవాణా ఇబ్బంది కూడా రైతుకు ఉండదు. ఉద్యానవన శాఖ మూడేళ్ల పాటు పంట నిర్వహణ ఖర్చులు రైతు ఖాతాకు జమ చేస్తుంది.

రైతుకు రాయితీలు

ఆయిల్‌పామ్‌ సాగులో రెండు రకాల మొక్కలను సాగు చేసేందుకు ఉపయోగిస్తారు. స్వదేశీ రకం ఒక్కో మొక్కకు రూ.133లు, దిగుమతి రకం మొక్కకు రూ.193లు రాయితీని ప్రభుత్వం అందిస్తుంది.ఒక ఎకరాకు 60 మొక్కలు చొప్పున నాటాలి. ఒక్క ఎకరాకి ఇండిగోనియస్‌ రకానికి రూ.8వేలు సబ్సిడీ, ఎగుమతి రకానికి రూ.11,600లు చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది.

ఇవీ ప్రయోజనాలు

ఏడాది పొడవునా నెలసరి ఆదాయం, మార్కెట్‌ ధరకు హామీ ఉంటుంది.

పామాయిల్‌ పంటకు దొంగల భయం ఉండదు. ఇతర అవసరాలకు ఉపయోగపడదు.

ఆయిల్‌పామ్‌ పంటలో తెగుళ్లు, వ్యాధులు చాలా తక్కువ మొదటి మూడేళ్లలో ఏక వార్షిక పంటలైన కూరగాయలు, పూలు, అరటి, పసుపు, అల్లం, పైనాపిల్‌ వంటివి అంతర పంటలుగా వేసుకోవచ్చు. ఆ తర్వాత నీడను ఇష్టపడే పంట కోకో వంటి అంతర పంట సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

ఆయిల్‌ పామ్‌ 4–6 ఏళ్లు గల తోట నుంచి ఎకరాకి 8 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంది

పామాయిల్‌ పంటతో ముఫ్ఫై ఏళ్ల పాటు నిరంతరం రైతుకు ఫలసాయం వస్తుంది

పామాయిల్‌ పంటల్లో అంతర పంటలుగా వేసి వాటితోనూ లాభాలను సంపాదించుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement