15 మందికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

15 మందికి గాయాలు

Published Fri, Jan 17 2025 12:22 AM | Last Updated on Fri, Jan 17 2025 12:22 AM

15 మం

15 మందికి గాయాలు

రెండు ఆటోలు బోల్తా:

ఆడలి ఘాట్‌రోడ్‌లో ప్రమాదం

సీతంపేట: పండగపూట సీతంపేట ఏజెన్సీలో విహార యాత్రకు వచ్చిన పర్యాటకులకు విషాదం మిగిలింది. ఆడలి వ్యూపాయింట్‌ ఘాట్‌ రోడ్‌లో రెండు ఆటోలు గురువారం సాయంత్రం వేర్వేరుగా బోల్తా పడిన సంఘటనలలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పాలకొండ మండలం వాటపాగు, బూర్జమండలం కురుంపేటలకు చెందిన గ్రామస్తులు ఆడలి వ్యూపాయింట్‌ చూడడానికి ఆటోల్లో వేర్వేరుగా వెళ్లారు. తిరిగి వస్తుండగా వెలంపేట మలుపు వద్దకు వచ్చేసరికి కురుంపేటకు చెందిన ఆటోను వెనుక వస్తున్న మరో ఆటో ఢీకొట్టడంతో లోయలో బోల్తాపడింది. పలువురికి గాయాలయ్యాయి. అక్కడే నిల్చుని ఉన్న వెల్లంగూడకు చెందిన గిరిజనుడైన సవర రెల్లయ్యపై ఆటో పడడంతో తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. కాగా వాటపాగు గ్రామానికి చెందిన మరో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న వారికి కూడా గాయాలయ్యాయి. రెండు ఆటోల్లో క్షతగాత్రులైన ఎం.రామ్మూర్తి, కె.రోహన్‌, చిరంజీవి, ఇందుమతి, హేమంత్‌, యశోద, సంజన, వెంకటలక్ష్మి, చిన్న, సూర్యనారాయణ, అప్పలనాయుడు, అభి తదితరులను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించిన యామిని, రెల్లయ్యలను శ్రీకాకుళం రిమ్స్‌కు మెరుగైన వైద్యసేవలకు తరలించారు. ఎస్సై వై.అమ్మాన్‌ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కోడి పందాలపై పోలీసుల దాడులు

చీపురుపల్లి: మండలంలోని మెట్టపల్లి గ్రామ పరిసరాల్లో నిర్వహిస్తున్న కోడి పందాలపై ఎస్పీ వకుల్‌ జిందల్‌ ఆదేశాల మేరకు ఎస్సై ఎల్‌.దామోదరరావు ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం దాడులు నిర్వహించారు. కోడి పందాలు ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తుల నుంచి రూ.15,280 నగదు, ఎనిమిది సెల్‌ఫోన్లు, ఆరు కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నుట్లు ఎస్సై దామోదరరావు తెలిపారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా కోడి పందాలు ఆడుతున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

పందెంరాయుళ్ల అరెస్ట్‌

నెల్లిమర్ల రూరల్‌: మండలంలోని తంగుడుబిల్లి గ్రామంలో కోడి పందాల స్థావరంపై పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. తంగుడుబిల్లి గ్రామశివార్లలో కోడి పందాలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో ఎస్సై గణేష్‌ ఆధ్వర్యంలో సిబ్బంది రైడ్‌ చేయగా చెరువు సమీపంలో కోడి పందాలు ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి మూడు కోడి పుంజులు, రూ.1510 నగదు సీజ్‌ చేశారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించామని ఎస్సై తెలిపారు. కాగా సంక్రాంతి నేపథ్యంలో మండలంలోని తంగుడుబిల్లి, ఏటీ అగ్రహారం, మల్యాడ, తదితర గ్రామాల్లో కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి.

యువకుడి ఆత్మహత్య

నెల్లిమర్ల రూరల్‌: తీసుకున్న అప్పులు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడలో జరిగిన ఈ ఘటనపై ఎస్సై గణేష్‌, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన టి. సూర్యనారాయణ(26) విజయనగరం పట్టణంలో ఒక బట్టల దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన అవసరాల కోసం అప్పులు చేసి వాటిని తీర్చలేక మనస్తాపంతో ఈ నెల 14న గ్రామ శివారులోని మామిడి తోటలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఘటనా స్థలం నుంచి ఇంటికి వెళ్లిన సూర్యనారాయణ వాంతులు చేసుకోవడంతో తల్లి ప్రశ్నించగా..జరిగిన విషయం చెప్పాడు. చికిత్స నిమిత్తం వెంటనే విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి సోదరుడు కనకరాజు ఫిర్యాదు మేరకు ఎస్సై గణేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
15 మందికి గాయాలు
1
1/2

15 మందికి గాయాలు

15 మందికి గాయాలు
2
2/2

15 మందికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement