అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
● చీరతో ఊరివేసి ఉన్న మృతదేహం
● సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, సీఐలు
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో బుధవారం రాత్రి మృతి చెందింది. ఈ సంఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దండు సింహాచలం(55) భర్త త్రినాథ రావు తొమ్మిదేళ్ల క్రితం మృతిచెందాడు. అప్పటి నుంచి ఆమె టీ కొట్లకు నీరు పెరగడం, గ్రామాల్లో నూనె, పిండి వడియాలు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ప్రతి ఏటా సంక్రాంతి పండగకు తన కన్నవారి ఊరు బొబ్బిలి మండలంలోని కోమటిపల్లి గ్రామానికి వెళ్లేది. ఈ ఏడాది కూడా సంక్రాంతి పండగకు అన్నదమ్ములు పిలిచారు కానీ ఆమె వెళ్లలేదు. ఎందుకు తోబుట్టువు రాలేదా? అని అన్నదమ్ములు బుధవారం ఆమెకు ఫోన్ చేశారు. ఎంతకీ ఫోన్ ఎత్తకపోవడంతో కొట్టక్కిలో ఉన్న బంధువులకు ఫోన్ చేశారు. దీంతో సింహాచలానికి వరుసకు మేనల్లుడు అయిన మన్మథరావు, మరో ఇద్దరు మహిళలు కలిసి ఆమె ఇంటికి వెళ్లి తలుపు తీయగా ఇంటి లోపల ఫ్యాన్ కొక్కానికి చీర కట్టి ఊరివేసి కిందకి వెల్లకిలా పడి ఉంది. దీంతో అనుమానం వచ్చి వారు ఆమె అన్నదమ్ములకు సమాచారం ఇచ్చారు. వారు కొట్టక్కి వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్సై వెలమల ప్రసాదరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం అనుమానాస్పద స్థతిలో ఉండడంతో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ కె.నారాయణరావులకు విషయం తెలియజేశారు. సమాచారం మేరకు వారు రాత్రికి రాత్రే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గురువారం ఉదయం విజయనగరం నుంచి క్లూస్‌టీమ్‌ను రప్పించి డాగ్ స్క్వాడ్‌తో చెక్ చేశారు. మళ్లీ గురువారం ఉదయం కూడా డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని చుట్టుపక్కల ఉన్న వారిని, స్థానికులను, బంధువులను ఆమెకు ఎవరైనా పగవారు ఉన్నారా?లేక డబ్బు బంగారం ఏమైనా ఉందా? అని ఆరాతీశారు. ఆమెకు ఎవరూ పగవారు లేరని, ఆమె కడుబీదరాలని, బంగారం,డబ్బు కూడా లేదని స్థానికులు డీఎస్పీకి వివరించారు. దీంతో బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. మృతురాలు నాలుగు అడుగుల ఎత్తు మాత్రమే ఉందని, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు లేదని, ఎవరైనా హత్యచేశారా? లేక ఆత్మహత్య చేసుకుందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment