మరణంలోనూ వీడని బంధం
సంక్రాంతి పండగకని సొంతూరు వెళ్లిన ఆ కుటుంబానికి తిరుగు ప్రయాణంలో మృత్యువు విషాదం మిగిల్చింది. ఇద్దరు బిడ్డలతో భార్యాభర్తలు సొంతూరు నుంచి ప్రస్తుతం నివాసం ఉంటున్న రామభద్రపురానికి బైక్‌పై వస్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. సంఘటనా స్థలంలోనే తండ్రీకొడుకులు దుర్మరణం చెందగా... తల్లీకుమారుడు గాయాల పాలయ్యారు. దీంతో స్వగ్రామంతో పాటు నివాసం ఉంటున్న గ్రామంలో కూడా విషాదం అలుముకొంది. వివరాల్లోకి వెళ్తే...
పార్వతీపురం టౌన్: పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామ సమీపంలో లారీ – బైక్ ఢీకొన్న ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. జియ్యమ్మవలస మండలం అల్లువాడ గ్రామానికి చెందిన లోలుగు రాంబాబు బాడంగిలో 108వాహనంలో ఈఎంటీగా పని చేస్తున్నాడు. ఈయన భార్య ఉమాదేవి పాచిపెంటలోని ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తుంది. వీరికి మోక్షశ్రీహాన్, సూర్యశ్రీహాన్ పిల్లలు ఉన్నారు. ఉద్యోగానికి వెళ్లేందుకు వీలుగా ఉంటుందని రామభద్రపురంలో కుటుంబంతో ఉంటున్నారు. సంక్రాంతి సెలవులు ఇచ్చిన తరువాత పిల్లలతో కలిసి ఉమా దేవి అల్లువాడలోని అత్త వారింటికి వెళ్లింది. రాంబాబు కూడా సంక్రాంతికి అల్లువాడ వెళ్లి సరదగా పండగ జరుపుకున్నారు. అనంతరం ముక్కనుమ రోజు ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి రాంబాబు గురువారం రామభద్రపురానికి తిరుగు పయనమయ్యాడు. పార్వతీపురం మండలం నర్సిపురం వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో సంఘటన స్థలంలోని రాంబాబు(44), కుమారుడు మోక్షశ్రీహాన్(5) మృతి చెందారు. ఉమాదేవి, సూర్యశ్రీహాన్ స్వల్పంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను మన్యం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కన్నీరుమున్నీరు
ప్రమాదంలో రాంబాబు, మోక్షశ్రీహాన్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యు లు, బంధువులు జిల్లా ఆస్పత్రికి తరలివచ్చారు. కన్నీరుమున్నీరయ్యారు. సంక్రాంతి పండగ సందడే తీరలేదని, ఇంతలోనే ఎంత ఘోరం జరిగిపోయిందంటూ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఐదేళ్లకే చిన్నారికి నిండు నూరేళ్లు నిండిపోయాయంటూ రోదించిన తీరు కలచివేసింది.
పండగ పూట విషాదం
బైక్‌ను లారీ ఢీకొనడంతో
తండ్రీకొడుకుల దుర్మరణం
తల్లీకుమారుడికి గాయాలు
పండగకు సొంతూరు వెళ్లి
తిరిగొస్తుండగా ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment