తగ్గిన చెరకు సాగు
ఏడాది కాలం కష్టం
రేగిడి:
ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో చెరకుపంట సాగు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో చెరకు రైతుకు ప్రోత్సాహం అందకపోవడం, పెట్టుబడి సాయం, పంట నష్టపోయిన సమయంలో పరిహారం మంజూరుకాకపోవడం, కూలీల కొరత, సాగునీటి ఇబ్బందులు, అందుబాటులో లేని సుగర్ ఫ్యాక్టరీలు.. వెరసి సాగుపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత రబీలో చెరకు సాగుపై రైతులు కనీసం ఆసక్తి చూపడం లేదు. రేగిడి మండలం సంకిలి ఈఐడీ ప్యారీ సుగర్ ఫ్యాక్టరీకి సైతం లక్ష్యానికి తగ్గట్టుగా చెరకు క్రషింగ్‌కు అందేపరిస్థితి కనిపించడం లేదు.
సాగు తగ్గుముఖం
చెరకు పంట సాగు విస్తీర్ణం తగ్గుముఖం పడుతూ వస్తోంది. గతేడాది మూడు జిల్లాల్లో కలిపి అధికారికంగా 21 వేల ఎకరాల్లో సాగు చేయగా, అనధికారికంగా మరో 2 వేలఎకరాల్లో సాగుచేశారు. ఈ ఏడాది 17 వేల ఎకరాలకు ఈ సాగు పరిమితమైంది. ఇందులో 13,600 ఎకరాలకు చెందిన రైతులు తమ చెరకు పంటను సంకిలి సుగర్ ఫ్యాక్టరీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మిగిలిన రైతులు బెల్లం తయారుచేస్తున్నారు. సాగు తగ్గడంతో చెరకు పంటకు డిమాండ్ పెరిగింది. ఈఐడీ ప్యారీ రైతులు అడగముందే టన్నుకు రూ.3,151లు ధర నిర్ధారించింది. బెల్లం ధర గతంలో టన్ను రూ. 36వేలు నుంచి రూ.38 వేలు ఉంటే ఈ ఏడాది రూ.45 వేలకు చేరుకుంది. సంకిలి సుగర్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో విరివిగా ఉండే చెరకు సాగు తగ్గడంతో ఫ్యాక్టరీకి లక్ష్యానికి తగ్గట్టుగా చెరకు క్రషింగ్‌కు రావడంలేదు. మరో వైపు ఈ ఫ్యాక్టరీ అందించే పారిస్ చక్కెర ధర పెరిగే అవకాశం ఉంది.
ఫ్యాక్టరీకి తరలించేందుకు చెరకును నరుకుతున్న రైతులు
రైతులను ప్రోత్సహిస్తున్నాం
చెరకు సాగుచేసే రైతులను ప్రోత్సహిస్తున్నాం. మా ఫ్యాక్టరీతో విల్లింగ్ పెట్టుకుంటే విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం. సాగునీటి సమస్య, కూలీల కొరత, రుణ లభ్యతలో ఇబ్బందులు కారణంగా చెరకు సాగును తగ్గించేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవచూపాలి.
– బి.పట్టాభిరామిరెడ్డి,
ఈఐడీ ప్యారీ సుగర్ ఫ్యాక్టరీ అసోిసియేటివ్ వైస్ ప్రెసిడెంట్, సంకిలి
గతంలో ఇలా..
జిల్లాలో 2024 ఏడాదిలో చెరకు సాగు :
21 వేల ఎకరాలు
ఈ ఏడాది సాగు: 17 వేల ఎకరాలు
గతేడాది ఈఐడీ ఫ్యాక్టరీకి తరలించిన చెరకు : 18 వేల ఎకరాల పంట
ఈఏడాది ఫ్యాక్టరీకి తరలించేందుకు రైతులు ఆమోదం తెలిపిన విస్తీర్ణం:
13,600 ఎకరాలు
కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహం
రైతుల్లో అనాసక్తి
మదుపులెక్కువ... ఆదాయం తక్కువ
ఎక్కువ కష్టం
చెరకు పంట సాగు చాలా ఎక్కువ కష్టంతో కూడుకున్నది. ఆశించిన ఆదాయం రావడం లేదు. సరైన కూలీలు ఇక్కడ లభించడం లేదు. దీంతో చెరకు సాగుకు బదులు వేరే పంటలు సాగుచేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం.
– బెవర త్రినాథరావు, చెరకు రైతు,
వన్నలి, రేగిడి మండలం
గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఏడాదికి రూ. 13500 ఆర్థికసాయం రైతులకు అందించేది. వ్యవసాయ పరికరాలు కొనుగోలుకు రుణాలు అందించేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. రైతన్నకు పెట్టుబడి భరోసా కరువైంది. పంట మదుపు తడిసిమోపెడవుతోంది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఎకరా చెరకు సాగుకు రూ.40వేలకు పైగా ఖర్చు అవుతుందన్నది రైతుల మాట. 10 నుంచి 11 నెలలు పాటు ఇంటిల్లిపాదీ కష్టపడితే పంట చేతికందుతుంది. చెరకు సాగుచేస్తే రబీలో మరో పంట వేసే అవకాశం లేదు. ఇనుప, కుళ్లు, నల్లి వంటి చీడపీడలు పంటను ఆశిస్తే పంట మొత్తం నిలువునా పాడవుతుంది. చెరకు పంట కటింగ్‌కు ఇతర ప్రాంతాల కూలీలను తీసుకురావాలి. ఫ్యాక్టరీ యాజమాన్యం సకాలంలో కటింగ్ ఆర్డర్ ఇవ్వకుంటే పంట పాడవుతుంది. కోసిన పంట సకాలంలో ఫ్యాక్టరీకి చేరకుంటే నాణ్యత తగ్గి, తూకం పడిపోతుంది. ఈ కష్టాల నేపథ్యంలో రైతు తియ్యని చెరకు సాగును పక్కనపెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment