నేడు నవోదయ ప్రవేశ పరీక్ష
● 6,207 మందికి 32 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
విజయనగరం అర్బన్: నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్షను శనివారం జిల్లావ్యాప్తంగా 32 కేంద్రాల్లో నిర్వహించనున్నామని డీఈఓ యూ.మాణిక్యం నాయుడు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు జిల్లాలోని 6,207 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం ఒక్కో కేంద్రానికి ఒక ముఖ్య పర్యవేక్షకుడు, పరిశీలకుడు చొప్పున ముఖ్య పర్యవేక్షకులు 32మంది, పరిశీలకులు 32 మందిని నియమించినట్లు చెప్పారు. ఇన్విజిలేటర్లుగా 291 మందిని నియమిస్తూ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. విజయనగరం, రాజాం, ఎస్‌కోట, నెల్లిమర్ల, కొత్తవలస, గజపతినగరం, చీపురుపల్లి, బొబ్బిలి, భోగాపురం, బాడంగి మండల కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు.
ముగిసిన స్టాఫ్ నర్సుల పోస్టుల దరఖాస్తుల గడువు
మహారాణిపేట (విశాఖ): ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఖాళీగా ఉన్న 106 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారంతో ముగిసింది. ఆఫ్‌లైన్‌లో 8,250 దరఖాస్తులు వచ్చాయని, ఆన్‌లైన్ కూడా దరఖాస్తులు పెద్దసంఖ్యలో వచ్చాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్ పి.రాధారాణి తెలిపారు. పూర్తి వివరాల కోసం https://nagendrasvst.wordpress.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
పోస్టర్ ఆవిష్కరణ
పార్వతీపురం: తోటపల్లి వేంకటేశ్వరస్వామి విగ్రహ పునఃప్రతిష్టోత్సవ పోస్టర్‌ను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ కలెక్టర్ కార్యాలయంలో తోటపల్లి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్టోత్సవం జరుగుతుందని, పుష్పగిరి పీఠాధిపతి శంకర భారతి స్వామి పాల్గొంటారని కమిటీ సభ్యుడు డి.పారినాయుడు తెలిపారు. 7న యంత్ర ప్రతిష్ట, కుంభాభిషేకం తదితర పూజలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణానికి గరుగుబిల్లి మండలం గిజబ గ్రామానికి చెందిన ప్రసాద్ లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా ట్రస్టు కోశాధికారి దుర్గారావుకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment