మైలారం గుట్ట పరిరక్షణకు ఉద్యమం
బల్మూర్: మైలారం గుట్ట పరిరక్షణకు ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిద్దామని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. పౌరహక్కుల సంఘం నాయకుల బృందం గురువారం మండలంలోని మైలారం గుట్టపై తవ్వకాలను పరిశీలించింది. అంతకుముందు గ్రామస్తులతో సమావేశమై తవ్వకాలతో పర్యావరణానికి జరిగే నష్టాన్ని తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. మైలారం గుట్టపై మైనింగ్‌కు అనుమతులతో గ్రామస్తులకు జీవన్మరణ సమస్య ఏర్పడిందన్నారు. 50 శాతం ఇళ్లు గుట్టపైనే ఉన్నాయని.. వారంతా ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ప్రభుత్వం వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, కేవలం మాజీ సర్పంచులు ఇచ్చిన తప్పుడు తీర్మానాలతో అనుమతులివ్వడం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటమేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం, రాజ్యాంగాన్ని మరిచి సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం దుర్మార్గమైన చర్యన్నారు. ౖదీనిపై తమ సంఘం ఆధ్వర్యంలో న్యాయపరంగా పోరాటం సాగించడంతో పాటు ఉద్యమం చేపడతామన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, సహాయ కార్యదర్శి తిరుమలయ్య, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సుభాన్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రమేష్ చందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలయ్య, రాములు, వెంకటేష్, మహేష్, రాజు, మాజీ సర్పంచులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, బంగారయ్య, సత్యంగౌడ్ దేవస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment