ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం సరికాదు
గోపాల్‌పేట: కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని నిబంధనల ప్రకారం తక్షణమే కొనుగోలు చేయాలని.. కాలయాపన చేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాయని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం, తాడిపర్తి వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వారం కిందట ధాన్యం తీసుకొచ్చామని.. ఇంకా కొనుగోళ్లు చేపట్టడం లేదని గోపాల్‌పేటలో కొందరు రైతులు వారి బాధను అడిషనల్ కలెక్టర్‌కు వివరించారు. కేంద్రం ప్రారంభించి మూడు రోజులైనా ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని స్థానిక అధికారులను ప్రశ్నించారు. హమాలీలు రావడం లేదని బదులివ్వగా వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. కేంద్రాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ తిలక్‌రెడ్డి, ఆర్‌ఐ యాదయ్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment