సహజ వనరులను సంరక్షించాలి
వనపర్తిటౌన్: పరిశ్రమలు, పట్టణాల్లో వెలుస్తున్న కొత్త కొత్త వ్యాపారాల్లో ఉద్యోగ, ఉపాఽధి అవకాశాల కల్పనలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారి ఆధిపత్యం పెరుగుతుండటంతో స్థానికులకు అన్యాయం జరుగుతోందని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎం.రాఘవాచారి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో బుధవారం రాత్రి ‘ఉపాధి, ఉద్యోగ, వ్యాపారుల్లో స్థానికులకు అవకాశాలు.. సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువతరం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని.. పాలమూరు పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు ఉపాధి అవకాశాలు ఏ మాత్రం దక్కవని, ఇందుకోసం చర్చను విస్తృతంగా ప్రారంభించి పోరాటం దశకు తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు, ప్రజాసంఘాలు గళం విప్పాలని, ఎమ్మెల్యేలు స్థానికులకు అవకాశాల కల్పించేందుకు ఒత్తిడి పెంచాలని, ప్రజల వాదనలు వినిపించే వ్యక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడే వ్యక్తుల డిమాండ్లకు రాజకీయ పార్టీలు తలొగ్గి తీరాల్సిందేనన్నారు. స్థానిక వ్యాపారాలు, పరిశ్రమల్లో స్థానికులకే అవకాశాలు కల్పించాలంటూ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. పాలమూరులో కరువు పోలేదని.. సహజ వనరులు కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో కొన్నిచోట్ల సహజ వనరులు లూఠీ చేశారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక ప్రతినిధులు షావుకారి శాంతన్న, వెంకటేశ్వర్లుశెట్టి, ఐ.నారాయణ, ప్రజాసంఘాల ప్రతినిధులు యోసేపు, వేణుగోపాల్, చిన్నరాములు, జనజ్వాల, నాగరాజు, గోపాలకృష్ణ, స్వరాజ్యం, వెంకట్‌నారాయణ, అంబటిస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment