మానసిక ప్రశాంతతతో సంపూర్ణ ఆరోగ్యం
వనపర్తిటౌన్: అనవసర ఆలోచనలకు దూరంగా ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని.. తద్వారా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వి.రజని అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వనపర్తి కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యంతోనే ఏదైనా సాధించవచ్చని, ఇందుకు అనువైన మార్గాలను అవలంబించాలన్నారు. శారీరక శ్రమతో పాటు వ్యాయామానికి రోజు తగిన సమయం కేటాయించడం అలవాటు చేసుకోవాలన్నారు. ఒత్తిడి, భయాందోళనకు గురికావద్దని.. చేయాల్సిన పని సకాలంలో పూర్తి చేయకపోతే మానసికశాంతి లోపిస్తుందని, అందుకు వాయిదాలకు స్వస్తి పలకాలని సూచించారు. చేసే వృత్తి, పనిలో కచ్చితత్వం, నిబద్దత ఉంటే మానసిక ఆశాంతిని దూరం చేయవచ్చన్నారు. జూనియర్ సివిల్‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.రవికుమార్ మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉంటే ధైర్యంతో మెలిగేందుకు బాటలు పడతాయని తెలిపారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మోహన్‌కుమార్ మాట్లాడుతూ.. సమాజంలోని రుగ్మతలు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తోందని వివరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, వైద్యులు పుష్పలత, మల్లేష్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment