మారని తీరు..
మాగనూర్ జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనంలో మళ్లీ పురుగులు
ఇదిలా ఉండగా, స్వయంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాగనూర్ పాఠశాలను సందర్శించి స్టాక్‌రూంలోని బియ్యాన్ని పరిశీలించారు. ఆ సమయంలో బియ్యంలో కలెక్టర్‌కు పురుగులు కనిపించలేదు. అయితే, అనంతరం అధికారుల పర్యవేక్షణలో హాస్టల్ సిబ్బంది మధ్యాహ్న భోజనం వండారు. సదరు అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు అన్నం తినకుండా పారబోసి ఆందోళనకు దిగారు. కలెక్టర్‌ను ఇక్కడి అధికారులు తప్పుదోవ పట్టించారా.. వండే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనేది విచారణ చేపడితే తప్పా బయటపడదంటూ వాపోయారు. చివరికి అధికారులు బియ్యం కొనుగోలు చేసి తీసుకువచ్చారు. సాయంత్రం 4 గంటలకు మరోమారు అన్నం వండి విద్యార్థులకు పెట్టారు. గురువారం వండిన అన్నంలో మరోసారి పురుగులు రావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. డీఈఓ అబ్దుల్ ఘనిని సస్పెండ్ చేశారు. అలాగే ఆర్డీఓ, ఎంపీడీఓ, పుడ్ ఇన్‌స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అన్నంలో పురుగులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మీ పిల్లలకు ఇలాంటి అన్నమే పెడతారా అని ప్రశ్నించారు. ఆయన సొంత డబ్బులతో బియ్యం కొనుగోలు చేసి పాఠశాలకు అందించారు.
● అన్నం పారబోసి విద్యార్థుల ఆందోళన
● హుటాహుటిన పాఠశాలను
పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
● విద్యార్థుల అస్వస్థతపై క్షేత్రస్థాయి
విచారణ చేపట్టిన కలెక్టర్
నారాయణపేట/మక్తల్/మాగనూర్: దాదాపు వంద మంది విద్యార్థులు నాణ్యత లేని మధ్యాహ్న భోజనం తిని ఆస్పత్రి పాలు కాగా.. అయినా కూడా సదరు సిబ్బంది తీరు మారడంలేదు. గురువారం సైతం మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేకపోవడంతో ఆ ఆహారం తిన్న దాదాపు వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మక్తల్, మహబూబ్‌నగర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. సరిగ్గా ఒక్కరోజు కూడా కాకముందే మరోసారి అన్నంలో పురుగులు రావడం.. కలెక్టర్ ఆదేశించినా సదరు సిబ్బంది నిర్లక్ష్యం వీడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థుల అస్వస్థతపై కలెక్టర్ విచారణ..
జిల్లాలోని మాగనూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో బుధవారం మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. పాఠశాల వంట గది, స్టోర్ రూం, వంటకు వినియోగించే బియ్యం, నిత్యావసరాల సరుకులను పరిశీలించారు. పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇకపై ప్రతిరోజు మధ్యాహ్న భోజనాన్ని పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు పరిశీలించి, రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు. ఈ సంఘటనలో 17 మంది విద్యార్థులకు వాంతులతో అస్వస్థతకు గురయ్యారని, వారిని మక్తల్ సీహెచ్‌సీ, మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు అందించినట్లు తెలిపారు. తాజాగా మహబూబ్‌నగర్ కలెక్టర్, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సమాచారం అందించి విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నామని, ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ వెల్లడించారు. ఈ ఘటనపై పాఠశాల హెచ్‌ఎంను సస్పెండ్ చేయడంతో పాటు వంట ఏజెన్సీని రద్దు చేసి ఇతర ఏజెన్సీకి అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి పాఠశాలలో టెస్టింగ్ (నాణ్యత పరిశీలన) కమిటీని ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. బియ్యాన్ని, మార్కెట్ నుంచి వచ్చే కూరగాయలు, కోడిగుడ్లను పరిశీలించిన తర్వాతే పాఠశాలకు తీసుకురావాలని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హెడ్మాస్టర్లు, వంట ఏజెన్సీలు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
అధికారులపై చర్యలు
Comments
Please login to add a commentAdd a comment