నెలలుగా విధులకు రాని ఉపాధ్యాయులు | - | Sakshi
Sakshi News home page

నెలలుగా విధులకు రాని ఉపాధ్యాయులు

Published Sat, Dec 21 2024 12:35 AM | Last Updated on Sat, Dec 21 2024 12:35 AM

నెలలుగా విధులకు  రాని ఉపాధ్యాయులు

నెలలుగా విధులకు రాని ఉపాధ్యాయులు

వనపర్తి రూరల్‌: మండలంలోని వెంకటాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బాలకృష్ణ, నరేందర్‌ ఆగస్టు నుంచి విధులకు రావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయంపై కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓను వివరణ కోరగా వారిద్దరూ ఎలాంటి సమాచారం లేకుండా విధులకు హాజరు కావడం లేదని, డీఈఓకు తెలియజేశామని బదులిచ్చారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని చిట్యాల పడమటితండా నుంచి ఓ ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై పంపించామని చిట్యాల కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు గణేష్‌కుమార్‌ వివరించారు. ఇరువురు ఉపాధ్యాయులు విధుల్లో చేరేందుకు గురువారం వస్తే డీఈఓ దగ్గరికి పంపించామని ఎంఈఓ మద్దిలేటి చెప్పారు.

కార్మికులు హక్కుల

సాధనకు ఉద్యమించాలి

అమరచింత: హక్కుల సాధన కోసం కార్మికులు ఉద్యమబాట పట్టాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోషా పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించిన బీడీ కార్మికుల జిల్లాస్థాయి రెండో మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆరోపించారు. ప్రతి కార్మికుడికి పీఎఫ్‌, గ్రాట్యూటీ చట్ట ప్రకారం అమలు చేయాలని, జీవన భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందరమ్మ ఇంటి నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్రం రూ.5 లక్షలు కేటాయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మిక ఆస్పత్రులకు తగిన నిధులు కేటాయించి వసతులు కల్పించాలని, మహిళా వైద్యులను నియమించాలని కోరారు. వెయ్యి బీడీల తయారీకి రూ.400 చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.220 ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. పని దినాలతో పాటు కూలి రేట్ల పెంపుపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాజీ లేని పోరాటాలు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, నాయకులు శ్యాంసుందర్‌, నరసింహాశెట్టి, భరత్‌, భాస్కర్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసంఘాల ఆందోళన

వనపర్తి రూరల్‌: రాజ్యసభలో కేంద్రమంత్రి అమిత్‌షా అంబేడ్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ చౌక్‌లో సీఐటీయూ, రైతు సంఘం, అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా), కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, సీపీఐ, ఏఐవైఎఫ్‌, ఏఐటీయూసీ, ఎన్‌ఎఫ్‌బ్ల్యూఏ, ఏఐఎస్‌ఎఫ్‌ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమిత్‌షా దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు మండ్ల రాజు, కురుమయ్య, బాలరాజు, సాయిలీల, బాలస్వామి, పరమేశ్వరాచారి, గంధం గట్టయ్య, లక్ష్మి, ఏఐవైఎఫ్‌ నాయకులు కళావతమ్మ, రమేష్‌, కుతుబ్‌, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement