ఎకరాకు రూ.30 లక్షలు ఇవ్వాలి
ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని గణప సముద్రం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం ఎకరాకు రూ.30 లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర రైతు సంఘం నాయకుడు ఎండి జబ్బార్ డిమాండ్ చేశారు. శనివారం గణపసముద్రం రిజర్వాయర్ పనులను సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.47.73 కోట్లతో జలాశయాన్ని నిర్మిస్తున్నారని.. ఇందులో 360 మంది రైతులకు చెందిన 420 ఎకరాల సాగు భూములు ముంపునకు గురవుతున్నాయని వివరించారు. పాత అలుగును మీటర్ ఎత్తు పెంచడంతో గ్రామం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని.. ఇళ్లల్లోకి నీటి ఊటలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అలుగు ఎత్తు పెంచకుండా పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు పరిశీలించి నాణ్యతగా పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు దేవేందర్, జిల్లా నాయకుడు మహేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment