‘తడి.. పొడి’ జాడేది?
వనపర్తి పురపాలికలో అమలుకు నోచుకోని చెత్త సేకరణ
వనపర్తిటౌన్: జిల్లాకేంద్ర పురపాలికలో తడి, పొడి చెత్త సేకరణపై అధికారులు, సిబ్బంది దృష్టి సారించకపోవడంతో పుర ఆదాయానికి గండిపడటమేగాక సేకరించిన చెత్త వృథా అవుతోంది. రెండేళ్ల కిందట తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు రూ.20 లక్షల పైచిలుకు వెచ్చించి పురపాలికలోని 16 వేల ఇళ్లకు ప్రతి ఇంటికి రెండు చొప్పున బుట్టలు పంపిణీ చేశారు. అలాగే రోజువారీగా ఇంటింటి నుంచి తడి, పొడి చెత్త సేకరించేందుకు ట్రాక్టర్లు, ఆటోలు ఏర్పాటుచేసి వేర్వేరుగా ఇవ్వాలని ప్రచారం చేసినా ఫలితం కనిపించడం లేదు. తడి చెత్తతో సేంద్రియ ఎరువు, పొడి చెత్తతో కార్మికులు ఆదాయం పొందవచ్చు. ఇందుకోసం పురపాలికకు ప్రత్యేక వాహనాలు, కార్మికులు, చెత్త డబ్బాలను సైతం సమకూర్చారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పూర్తిస్థాయిలో చెత్త సేకరించకపోవడంతో సేంద్రియ ఎరువు తయారీ ఆశించిన మేర జరగడం లేదు. అలాగే డంపింగ్‌యార్డు పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోకపోవడంతో తడి, పొడి చెత్తను ఒకేచోట కుప్పలుగా పారబోస్తున్నారు. ప్రణాళిక లేకుండా నిధులు వెచ్చించి చెత్త బుట్టలు పంపిణీ చేశారే తప్పితే స్వచ్ఛ లక్ష్యానికి దోహదపడలేదనేది కళ్ల ఎదుట కనిపిస్తోంది.
రోజు 40 మెట్రిక్ టన్నులు..
పురపాలికలో మొత్తం 33 వార్డులు ఉండగా.. ఇంటింటి నుంచి చెత్త సేకరణకు 13 ట్రాక్టర్లు, 3 ఆటోలు ఉన్నాయి. కేవలం చెత్త సేకరణకు 40 మందిపైగా కార్మికులు రెండు విడతల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా వారు డ్రెయినేజీలు, రహదారులను శుభ్రం చేయడం, కార్యాలయాలు, పార్కుల్లో పని చేస్తున్నారు. మొత్తంగా రోజుకు సుమారు 40 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. పొడి చెత్త నుంచి ప్లాస్టిక్, గాజు సీసాలు, ఇనుప చువ్వలను సేకరించి పురపాలిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొడి వనరుల సేకరణ కేంద్రంలో విక్రయించి కార్మికులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. డంపింగ్‌యార్డుకు తరలించిన తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయాలి. చెత్తను ఇష్టానుసారంగా డంప్ చేస్తుండటంతో దుర్వాసన వస్తోందని మూడు నెలల కిందట నాగవరం ప్రజలు ఆందోళనకు దిగిన ఘటనలు ఉన్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారులు సక్రమంగా లేకపోవడంతో స్వీయింగ్ మిషన్ నిరుపయోగంగా ఉంది.
అవగాహన లోపం..
తడి, పొడి చెత్త సేకరణపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడంలో పుర సిబ్బంది విఫలమయ్యారు. తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయాల్సి ఉన్నా వివిధ కారణాలతో జాప్యం జరుగుతోంది. వాహనాల మెరాయింపుతో పలు వార్డుల్లో తరచూ చెత్త సేకరణలో ఆలస్యమవుతోంది.
నాగవరం సమీపంలోని డంపింగ్‌యార్డులో పేరుకుపోయిన చెత్త నిల్వలు
త్వరలో చేపడతాం..
ప్రస్తుతం పురపాలికలో తడి, పొడి చెత్త సేకరణ జరగడం లేదు. కార్మికులు, పురపాలికకు ఆదాయం సమకూర్చేందుకు తడి, పొడి చెత్త వేరు చేయాల్సి ఉంటుంది. ఆ దిశగా ముందుకు సాగుతున్నాం. సేంద్రియ ఎరువు తయారీతో పురపాలికకు ఆదాయం సమకూరడంతో పాటు పర్యావరణానికి దోహదపడుతుంది.
– పూర్ణచందర్, పుర కమిషనర్, వనపర్తి
ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేసినా ఫలితం శూన్యం
దృష్టి సారించని అధికారులు.. పుర ఆదాయానికి గండి
Comments
Please login to add a commentAdd a comment