సంబరం.. అసౌకర్యం కావద్దు | - | Sakshi
Sakshi News home page

సంబరం.. అసౌకర్యం కావద్దు

Published Tue, Dec 31 2024 1:13 AM | Last Updated on Tue, Dec 31 2024 1:13 AM

సంబరం

సంబరం.. అసౌకర్యం కావద్దు

రోడ్లపై నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటే చర్యలు

డీజేలకు అనుమతి లేదు

గస్తీ నిర్వహణకు ప్రత్యేక బృందాలు

డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు

‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌లో జిల్లా పోలీసు అధికారి రావుల గిరిధర్‌

● జిల్లాలో చెరుకు వాహనాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. మంగళవారం రాత్రి రాకపోకలు నిలిపివేయాలి.

– అంజద్‌, మదనాపురం

ఎస్పీ : చెరుకు ట్రాక్టర్లతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అమరచింత, ఆత్మకూరు, మదనాపురం, కొత్తకోట ఎస్‌ఐలను ఈ విషయంపై దృష్టి సారించాలని ఆదేశిస్తాం. రైతులెవరు చెరుకు తెస్తారనే విషయం ముందస్తుగా తెలియదు. బైక్‌లు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. హెల్మెట్‌ ధరించడంతో ప్రాణాపాయం చాలా వరకు తగ్గుతుంది.

వనపర్తి: నూతన సంవత్సర సంబరాలు ఇతరులకు అసౌకర్యంగా మారొద్దని ఎస్పీ రావుల గిరిధర్‌ సూచించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసుశాఖ చేపట్టే సన్నాహాలపై సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌–ఇన్‌లో జిల్లా ప్రజలు పలువురు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. జిల్లాలోని మూడు పోలీస్‌ సర్కిళ్ల పరిధిలో మంగళవారం రాత్రి ఏడు నుంచి బుధవారం తెల్లవారుజామున రెండు వరకు సిబ్బంది గస్తీ నిర్వహించేలా ప్రతి ఠాణాలో ఒక్కో బృందాన్ని ఏర్పాటుచేసి డ్యూటీ షెడ్యూల్‌ను నిర్ణయించామన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు పెంచుతామని.. ర్యాష్‌ డ్రైవింగ్‌, ప్రధాన కూడళ్లలో కేక్‌ కటింగ్‌లు, కేరింతలు తదితర హంగామాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాకేంద్రం, జాతీయ రహదారిపై ఉన్న పెబ్బేరు, కొత్తకోట పట్టణాలతో పాటు ఆత్మకూర్‌, అమరచింతలో సీఐ స్థాయి అధికారులు, మండల కేంద్రాలు, పెద్ద గ్రామాల్లో ఎస్‌ఐ స్థాయి అధికారులు గస్తీ నిర్వహించాలని ఆదేశాలిచ్చామన్నారు. ట్రిపుల్‌ రైడింగ్‌, వేడుకల పేరుతో గుంపులుగా చేరి భారీ శబ్ధాలతో ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, మత్తు పదార్థాలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఊసలు లెక్కించాల్సిందేనన్నారు. ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకొనేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా అపశృతి చోటుచేసుకుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని.. ఇందుకోసం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డయల్‌ 100కు ఫిర్యాదు చేస్తే కంట్రోల్‌ రూంకు వస్తాయన్నారు. అనంతరం పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

● కొత్తకోట–మదనాపురం రహదారి విస్తరణ చేయని కారణంగా ఇరుకుగా ఉంది. న్యూ ఇయర్‌ వేడుకల పేరుతో రోడ్డుపై కార్యక్రమాలు నిర్వహించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

– శ్రీనివాస్‌రెడ్డి, కొత్తకోట

ఎస్పీ : రోడ్లపై డీజేలు, సౌండ్‌ బాక్సులు ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అనుమతులు లేవు. ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తే నిర్వాహకులపై చర్యలు తప్పవు. మద్యం తాగి రోడ్లపై నృత్యాలు చేయటం, కేక్‌ కటింగ్‌లతో రాకపోకలకు ఆటంకం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కొత్తకోటలోని అన్ని కాలనీల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తారు. రోడ్లపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా సమాచారం ఇవ్వండి.

● మందుబాబులు గ్రామాల్లోని పాఠశాలల ఆవరణల్లో మద్యం తాగి సీసాలు అక్కడే పారవేస్తున్నారు. ఉదయం వచ్చిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా ఇలాంటివి ఇంకా పెరగొచ్చు. ప్రత్యేక దృష్టి సారించాలి. – రాము, పాన్‌గల్‌

ఎస్పీ : పాఠశాలల్లో మద్యం తాగితే కఠిన చర్యలు ఉంటాయి. గ్రామాలకు కేటాయించిన పోలీసు అధికారులు గస్తీ నిర్వహిస్తారు. ఎక్కడైనా కనిపిస్తే వెంటనే డయల్‌ 100కు ఫిర్యాదు చేయండి.

ఎస్పీ

రావుల

గిరిధర్‌

మద్యం తాగి వాహనాలు నడపడం, ద్విచక్ర వాహనాల సైలెన్సర్ల మార్చి భారీ శబ్దాలతో ఊరేగింపులు నిర్వహిస్తుండటం భరించలేకపోతున్నాం. ఇలాంటి వాహనాలను సీజ్‌ చేయాలి.

– శ్రీకాంత్‌, వనపర్తి

ఎస్పీ : ఇలాంటి వాటిపై ట్రాఫిక్‌ ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది దృష్టి సారించాలని ఆదేశించాం. రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే వారికి అతి సమీపంగా వచ్చి శబ్ధాలు చేస్తున్నారని తెలుస్తోంది. కొత్త సంవత్సర వేడుకల్లో ఇలాంటి ఘటనలు ఎక్కడ చోటుచేసుకున్నా వాహనాలను సీజ్‌ చేయాలని చెప్పాం. ప్రధాన కూడళ్లలో బైక్‌లపై కేక్‌ కటింగ్‌లు చేస్తే చర్యలు తప్పవు.

డీజేలకు అనుమతి ఇవ్వొద్దు.. మద్యం తాగి సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. – మహదేవన్‌గౌడ్‌, దుప్పల్లి

ఎస్పీ : న్యూ ఇయర్‌ వేడుకల్లో డీజేలు, సౌండ్‌ బాక్సుల ఏర్పాటుకు పోలీస్‌శాఖ అనుమతి ఇవ్వదు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మంగళవారం రాత్రి పోలీసులు గస్తీ నిర్వహిస్తారు. ప్రజల స్వేచ్ఛను హరించే ఎలాంటి కార్యకలాపాలు చేసినా చర్యలు తీసుకుంటాం.

No comments yet. Be the first to comment!
Add a comment
సంబరం.. అసౌకర్యం కావద్దు 1
1/1

సంబరం.. అసౌకర్యం కావద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement