చోరీలు, ప్రమాదాలు ఎక్కువే
జిల్లాలో గతేడాదితో పోలిస్తే పెరిగిన దొంగతనాలు.. యాక్సిడెంట్లు
వనపర్తి: జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే.. చోరీలు ఎక్కువగానే జరిగినట్లు పోలీసుశాఖ వెల్లడించిన వార్షిక క్రైం రిపోర్టుతో స్పష్టమవుతోంది. పట్టణం, పల్లె.. రాత్రి పగలు తేడా లేకుండా దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం ఇప్పటి వరకు 80 శాతం చోరీ కేసులు అధికంగా నమోదైనట్లు అధికారిక లెక్క. ఇదిలా ఉండగా.. రికవరీ విషయంలో పదిశాతం వెనుకబడింది. 2024, జనవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన దొంగతనాల కేసుల్లో 55.46 శాతం ఛేదించినట్లు వార్షిక నివేదికలో పేర్కొన్నారు.
10 శాతం పెరిగిన రోడ్డు ప్రమాదాలు..
గతేడాదితో పోలిస్తే.. రోడ్డు ప్రమాదాలు పదిశాతమే పెరిగినా.. మరణాల సంఖ్య అధికంగా ఉంది. ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉండటం గమనార్హం. మైనర్ డ్రైవింగ్ కేసుల్లో మృతుల సంఖ్య కూడా ఎక్కువగా నమోదైంది. నిత్యం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడంతో పాటు కొత్తకోటలో డ్రైవింగ్‌పై అవగాహన కల్పించేందుకు ఎస్పీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినా ప్రమాదాలు అదుపులోకి రాలేదు. ఈ విషయంపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ స్వయంగా జిల్లా న్యాయమూర్తిని కలిసి కోరారు. అప్పటి నుంచి డ్రంకెన్‌డ్రైవ్ కేసుల్లో కోర్టు సైతం జైలుశిక్ష విధిస్తుండటంతో కొద్దిమేర అదుపులోకి వచ్చినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.
మృతుల సంఖ్య అధికమే
2024 వార్షిక నేర
నివేదిక వెల్లడించిన ఎస్పీ
ఈ ఏడాది జరిగిన ఘటనలు..
2024లో ప్రధానంగా మూడు సంఘటనలు జిల్లా ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. అందులో చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో 2024, మే 23 రాత్రి బీఆర్‌ఎస్ ప్రధాన నాయకుడు శ్రీధర్‌రెడ్డి దారుణ హత్య.
2024, ఏప్రిల్ 3న పెబ్బేరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో సుమారు రూ.10 కోట్ల విలువైన గన్నీబ్యాగులు అగ్నికి ఆహుతైన ఘటనలో కొందరు రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు ప్రచారంలో ఉన్నా.. ఆ కేసులో నేటికీ ఎలాంటి పురోగతి కనిపించకపోవడం గమనార్హం. రూ.కోట్ల ప్రజాధనం కాలి బూడిదైనా బాధ్యులను గుర్తించలేదు.
ఈ నెల 18 తెల్లవారుజామున జగిత్యాలకు చెందిన ఓ కుటుంబం తిరుపతికి వెళ్లి వస్తూ పెబ్బేరు సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ట్రక్ పార్కింగ్ స్థలంలో వాహనం నిలిపి నిద్రిస్తుండగా మహారాష్ట్ర పార్థీ గ్యాంగ్ ఒక్కసారిగా రాళ్లు, కత్తులతో దాడిచేసి గాయపర్చి మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment