మెట్ట పంటలకు చెల్లుచీటి
జిల్లాలో ఏటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం
● ఇతర జిల్లాల నుంచి దిగుమతి అవుతున్న జొన్న, మొక్కజొన్న, రాగులు
● సులభ వ్యవసాయం వైపు
అన్నదాతల చూపు
● కనిపించని రైతు చైతన్య యాత్రలు..
దిష్టిబొమ్మల్లా రైతువేదికలు
వనపర్తి: పంట మార్పిడి ప్రాముఖ్యతపై ఇటు రైతులు.. అటు వ్యవసాయశాఖ అఽధికారులు దృష్టి సారించకపోవడంతో మూస పద్ధతి సాగుకు దారితీస్తోంది. గతంలో వనపర్తి జిల్లా పరిధిలో ఏటా వానాకాలం సీజన్‌లో సుమారు 80 వేల ఎకరాల వరకు మెట్ట పంటల సాగు ఉండేది. సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల ఏర్పాటుతో అగ్రభాగం రైతులు వరి సాగుకు మొగ్గు చూపుతుండటంతో ఏటా మెట్ట పంటల సాగు తగ్గుతోంది. దీంతో జిల్లాలో జొన్న, మొక్కజొన్న, ఆముదం, రాగుల సాగు విస్తీర్ణం తగ్గి ఇతర జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై గతంలో వ్యవసాయ మంత్రిత్వశాఖతో పాటు అధికారులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసి మెట్ట సాగుకు రైతులను ప్రోత్సహించే ప్రయత్నాలు చేసినా.. ఆశించిన మేర ఫలితం కనిపించడం లేదు.
కానరాని రైతు అవగాహన సదస్సులు..
ఇదివరకు ఏటా వానాకాలం సీజన్‌కు ముందు వ్యవసాయశాఖ అధికారులు రైతు చైతన్య యాత్రల పేరిట గ్రామాల్లో పర్యటించి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేవారు. అలాగే ఆయా గ్రామాల్లో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు నిర్వహించి సాగు చేయాల్సిన పంటలు, సీజన్ల వారీగా మార్పిడిపై సూచనలు, సలహాలు ఇచ్చేవారు. పదేళ్లుగా రైతులకు పంటల సాగుపై సూచనలిచ్చే అధికారులు కరువయ్యారని చెప్పవచ్చు. రైతుల ప్రయోజనాల కోసం గ్రామాల్లో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన రైతువేదికలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులు వారికి సులువైన, అనువైన పంటలు సాగు చేస్తూ భూసారం విషయాన్ని పూర్తిగా విస్మరించడం శోచనీయం. ప్రస్తుత కాలంలో పట్టణం, పల్లె తేడా లేకుండా అందరూ పోషకాహారం తీసుకోవడం అలవాటు చేసుకొని అన్నం తినడం తగ్గించారు. జొన్న రొట్టె, రాగిపాలు, చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహారం తీసుకుంటున్నారు.
చిరు ధాన్యాలకు పెరిగిన
డిమాండ్..
మెట్ట పంటల ఉత్పత్తుల్లో పోషకాలు అధికంగా ఉండటంతో ప్రస్తుత మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చు. మానవాళితో పాటు పాడి పశువుల ఆహార సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చు. మెట్ట పంటల సాగుతో భూమి ఉపరితలం సారవంతంగా మారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment