అడిషనల్ కలెక్టర్ సందర్శన
పెబ్బేరు రూరల్: పెబ్బేరు పురపాలికలో శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పర్యటించారు. మొదట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడి భవనం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే నిర్మాణంలో ఉన్న పుర షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పరిశీలించి చైర్‌పర్సన్ కరుణశ్రీతో మాట్లాడి పనుల పురోగతిపై ఆరాతీశారు. నిర్మాణ దశలో ఉన్న కూరగాయల మార్కెట్‌ను పరిశీలించి ప్రహరీ చుట్టూ మొక్కలు నాటాలని సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. అల్లె శ్రీనివాసులు, కర్రె స్వామి, కౌన్సిలర్లు పార్వతిదేవి, చిన్న ఎల్లారెడ్డి, గణేష్‌బాబు, పుర అసిస్టెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్, హరినాథ్‌రెడ్డి, రాజశేఖర్, నిరంజనమ్మ పాల్గొన్నారు.
రైతులను మోసం చేస్తే చట్టపరంగా చర్యలు
పాన్‌గల్: నాసిరకం ఎరువులు, విత్తనాలను రైతులకు అంటగట్టి మోసం చేసే దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) గోవింద్‌నాయక్ అన్నారు. శుక్రవారం పాన్‌గల్, మాందాపూర్, జమ్మాపూర్, చిక్కేపల్లి తదితర గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో రికార్డులు, ఎరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు విధిగా రసీదు ఇవ్వాలని, ధరల పట్టికను దుకాణాల్లో ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఓ రాజవర్ధన్‌రెడ్డి, ఏఈఓలు పాల్గొన్నారు.
‘సీఎంఆర్’ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
వనపర్తి విద్యావిభాగం: మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాలలో జరిగిన ఘటనను నిరసిస్తూ శుక్రవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్‌చౌక్‌లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వపన్‌కుమార్ మాట్లాడారు. యాజమాన్యం విద్యార్థినుల నుంచి రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తూ వారికి రక్షణ కల్పించకుండా బాధ్యత రాహితంగా వ్యవహరించిందని ఆరోపించారు. హాస్టల్‌లో ఇంత జరుగుతున్నా యాజమాన్యం స్పందించకపోవడం విచారకరమన్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో ఎన్ని అక్రమాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. హాస్టల్‌కు జీహెచ్‌ఎంసీ అనుమతి ఉందా? లేదా ? చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రత్యేక కమిటీ వేసి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న సీఎంఆర్ విద్యాసంస్థలను సీజ్ చేయాలని.. స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున దశల వారీగా ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు. సంఘం జిల్లా కార్యదర్శి సాయికిరణ్, కమిటీ సభ్యులు రాజు, లావణ్య, రమాకాంత్, గణేశ్, ప్రవీణ్ పాల్గొన్నారు.
పుర టీఎన్‌జీఓల
జిల్లా కార్యవర్గం
వనపర్తి టౌన్: పురపాలిక టీఎన్‌జీఓల జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రమేష్‌బాబు(పెబ్బేరు), ఉపాధ్యక్షుడిగా పి.అనిల్‌కుమార్ (వనపర్తి), కార్యదర్శిగా రవీందర్(కొత్తకోట), కోశాధికారిగా జి.ఆంజనేయులు (వనపర్తి), కార్యనిర్వాహక కార్యదర్శిగా రాజ్‌కుమార్(వనపర్తి), ఈసీ సభ్యుడిగా బురాన్(పెబ్బేరు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. పుర ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పుర కమిషనర్ పూర్ణచందర్, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment