నీటి కాల్వలు కబ్జా!
చిన్నమారూర్ లిఫ్ట్ డి–2, ఎల్–2, జూరాల డి–36 కాల్వలు పూడ్చిన వైనం
వనపర్తి/చిన్నంబావి: దీర్ఘకాలిక రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వాలు నిర్మించిన సాగునీటి కాల్వలు, ల్యాండ్ బ్యాంకు, మట్టినిల్వలకు భద్రత కరువైంది. కొంతకాలంగా చిన్నంబావి మండలంలోని చిన్నమారూర్ డి–2, ఎల్–2, జూరాల డి–36 కాల్వలను పూడ్చడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. సాగునీటి కాల్వల నిర్మాణం సమయంలో ప్రభుత్వం ప్రధాన కాల్వకు ఇరువైపులా సుమారు 40 ఫీట్లు, డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు ఇరువైపులా సుమారు 16 ఫీట్ల మేర ల్యాండ్ బ్యాంక్‌కుగాను భూ సేకరణ చేపట్టింది. కాల్వల మరమ్మతు, నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఇరువైపులా రెండు నుంచి నాలుగు భారీ వాహనాలు సులభంగా తిరిగేలా స్థలం కేటాయిస్తారు. భూముల విలువ రూ.లక్షలకు చేరడంతో సమీప పొలాల రైతులు ఏటా కొద్దికొద్దిగా జరుగుతూ తమ భూ విస్తీర్ణం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు రియల్ వ్యాపారులు చిన్నంబావిలోని జూరాల డి–36 అనుబంధ కాల్వ పూడ్చి షాపింగ్ కాంప్లెక్స్‌లు, భారీ నిర్మాణాలు చేస్తున్నా ఇరిగేషన్ అధికారులు నోరు మెదపకపోవటం శోచనీయం.
2,500 ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం..
చిన్నంబావి మండలంలోని చిన్నమారూర్ డి–2, ఎల్–2 కాల్వలు కబ్జాకు గురికావడంతో వెల్టూరు, అయ్యవారిపల్లి, కొప్పునూరులోని సుమారు 2,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. 2009 కృష్ణానది వరదల సమయంలో చిన్నమారూర్ లిఫ్ట్ మునిగి కొన్నాళ్లు మరమ్మతుకు నోచుకోలేదు. ఆ సమయంలో రియల్ వ్యాపారులు కాల్వలను కబ్జా చేసినట్లు ప్రచారంలో ఉంది. ఇటీవల అధికారులు లిఫ్ట్ మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చారు. కానీ నిర్దేశిత ఆయకట్టుకు నీరందుతుందా అనే విషయంపై పర్యవేక్షణ చేయకపోవడం గమనార్హం. పాలకులు, అధికారులు దృష్టి సారించి తమ పొలాలకు సాగునీరు అందించాలని ఆయా గ్రామాల రైతులు వేడుకుంటున్నారు.
ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి..
కాల్వలను పూడ్చి దిగువ ఆయకట్టుకు నీరందకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆక్రమణకు గురైన కాల్వను తిరిగి తవ్వి వినియోగంలోకి తీసుకొస్తే ఏటా రెండు పంటలు పండించుకుంటాం. మా కష్టాలు తీరుతాయి.
– శివరాముడు, రైతు, వెల్టూరు (చిన్నంబావి)
యథేచ్ఛగా కబ్జా..
మండలంలో సాగునీటి కాల్వలను యథేచ్ఛగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. కాల్వ ఆక్రమణకు గురికావడంతో మూడు గ్రామాలకు సాగునీరు అందటం లేదు. రియల్ వ్యాపారులు కాల్వల భూముల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నారు. దిగువ ఆయకట్టుకు సాగునీరు అందకుండా చేస్తున్న వారిపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
– మధు, రైతు, వెల్టూరు (చిన్నంబావి)
పరిశీలిస్తాం..
కాల్వల కబ్జాపై గతంలోనూ పలుమార్లు ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రక్షణ వలయం ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపించాం. మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఆక్రమణల విషయంపై మరోసారి పరిశీలన చేస్తాం.
– జగన్మోహన్, ఈఈ,
జూరాల ఎడమకాల్వ విభాగం
యథేచ్ఛగా ఆక్రమణలు.. నిర్మాణాలు
జూరాల ప్రధాన ఎడమ, సమాంతర కాల్వల వద్ద ల్యాండ్‌బ్యాంకుకు సైతం భద్రత కరువు
పట్టించుకోని అధికారులు
Comments
Please login to add a commentAdd a comment