సాంకేతిక విద్యకు పెద్దపీట
● రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి
వనపర్తి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక విద్యకు పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా వనపర్తి రామన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో గతనెలలో ఐఐటీ టాలెంట్ టెస్ట్ నిర్వహించగా ఆదివారం జిల్లాకేంద్రంలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు రేవంత్ సర్కార్ చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. నేటి విద్యార్థులు ఆధునిక సాంకేతిక విద్యను అందిపుచ్చుకొనేందుకు కష్టపడి చదవాలని పిలుపునిచ్చారు. జిల్లాను విద్యారంగంలో ముందువరుసలో నిలపడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. వైద్య, సాంకేతిక విద్యకు సంబంధించిన స్టడీ సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. టాలెంట్ టెస్ట్‌లు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఎంతో దోహదపడుతాయన్నారు. పిల్లలను ప్రోత్సహించడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమని వివరించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టాలెంట్ టెస్ట్ నిర్వహించిన రామన్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ దేశి రాములు యాదవ్‌ను అభినందించారు. అనంతరం విజేతలను శాలువాలతో సత్కరించి నగదు, జ్ఞాపికలు అందజేశారు. సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్, డీసీఈబీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, మండల విద్యాశాఖ అధికారులు మద్దిలేటి, శ్రీనివాస్‌గౌడ్, ఏసీజీఓ కె.గణేష్‌కుమార్, స్పెక్ట్ర ఐఐటి కృష్ణ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సురభి శ్రీనివాసరావు, మహిపాల్‌రెడ్డి, హరిప్రసాద్, ఆర్.శ్రీనివాస్, వ్యాఖ్యాత బైరోజు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు షఫీ, రాజేంద్రాచారి, చిత్ర, మద్దిలేటి, ప్రవీణ్, భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment