బీజేపీ, బీఆర్‌ఎస్ నేతల ఆందోళన
చిన్నంబావి: మండలంలోని లక్ష్మీపల్లికి చెందిన బొడ్డు శ్రీధర్‌రెడ్డిని అతి కిరాతకంగా హత్యచేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా.. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శనివారం బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మండల కేంద్రంలోని పెబ్బేరు–కొల్లాపూర్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు మాట్లాడుతూ.. రెండునెలల క్రితం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ముట్టడిస్తే 20 రోజుల్లో నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారని, నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సిట్‌ను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించినా.. స్థానిక మంత్రి ఒత్తిడితో పట్టుకోవడం లేదన్నారు. కేసు విచారణ 95 శాతం పూర్తయిందని, నిందితులను త్వరలో పట్టుకుంటామని గత నెలలో ఐజీ చెప్పినా ఇప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదని తెలిపారు. పార్టీ రాష్ట్ర నాయకుడు ధారాసింగ్ మాట్లాడుతూ.. పోలీసుశాఖ అధికారపార్టీకి వత్తాసు పలుకుతూ నిందితులను కాపాడుతోందని, ఎన్నిరోజులు కేసును నాన్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటరమణమ్మ మాట్లాడుతూ.. గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కోలేక శ్రీధర్‌రెడ్డిని అధికార పార్టీ నాయకులు హత్య చేశారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నా పోలీసులు విచారణ చేయడం లేదన్నారు. ఆందోళనతో సుమారు రెండు గంటలకుపైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, సీఐ కృష్ణ, ఎస్‌ఐ జగన్‌మోహన్ నచ్చజెప్పినా వినకపోవడంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జగ్గారి శ్రీధర్‌రెడ్డి, మేకల శ్రీనివాస్ యాదవ్, గోపినాయుడు, వెంకట్‌రెడ్డి, సాయిప్రణీత్ గౌడ్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గోవిందు శ్రీధర్‌రెడ్డి, చక్రధర్ గౌడ్, తిరుపాల్, రామస్వామి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీధర్‌రెడ్డి హత్య
కేసు ఛేదనలో
పోలీసులు
విఫలమయ్యారని
ఆరోపణ
Comments
Please login to add a commentAdd a comment