పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
కొత్తకోట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులకే అందించేందుకు సర్వే పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని అప్పరాలలో కొనసాగుతున్న సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హులైన రైతు కుటుంబాలకు మాత్రమే రైతుభరోసా అందించేందుకు జీపీఎస్, జియోట్యాగింగ్ యాప్‌ల ద్వారా వ్యవసాయ యోగ్యంకాని భూములు అనగా లే అవుట్లు, ఇరిగేషన్, రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూములు, ఇళ్లు నిర్మించుకున్న స్థలాలు, పారిశ్రామిక స్థలాలను గుర్తించి రైతుభరోసా జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాను మరోసారి పరిశీలించి ఎవరైనా అనర్హులుంటే గుర్తించి జాబితా నుంచి తొలగించాలన్నారు. రేషన్ కార్డుల జారీకి సిద్ధం చేసిన జాబితాను మరోమారు ఇల్లిల్లూ తిరిగి వాస్తవికతను పరిశీలించాలని సూచించారు. 20వ తేదీలోపు సర్వే పూర్తి చేయాలని, 21 నుంచి 24వ తేదీ వరకు కొనసాగే గ్రామసభల్లో రూపొందించిన జాబితాపై చర్చించి తీర్మానం చేసి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేయాలన్నారు. తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ చెన్నమ్మ, ఇతర అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment