ఆదివాసీ గిరిజనులను నాయకులుగా చేయడమే లక్ష్యం
స్టేషన్ మహబూబ్‌నగర్: ఏఐసీసీ దేశవ్యాప్తంగా 25వేల మంది ఆదివాసీ గిరిజనులను నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ ఆదివాసీ విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మొదటగా ఈనెల 12 నుంచి 14 వరకు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం సోమశిలలో ఉమ్మడి జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఇద్దరు ఆదివాసీ గిరిజన నాయకులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. గిరిజనుల్లో రాజ్యాంగపరమైన హక్కులు, ఇవాళ అమలువుతున్న తీరు, లోపాలు, గిరిజన సంస్కృతిపై జరుగుతున్న దాడి తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పార్టీపరంగా ఒక యంత్రాంగం ఉండాలనే ఉద్దేశంతో మొదటగా ఉమ్మడి జిల్లాల వారీగా అనంతరం నియోజకవర్గం, మండలస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ రెండేళ్లలో 5 వేల మంది గిరిజనులను నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణరావు పాల్గొంటారని, చివరిరోజు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ హాజరై శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తారని తెలిపారు. ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు, ఆలిండియా ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ శివాజీరావుమోగే ఈ మూడు రోజుల శిక్షణలో పాల్గొంటారని తెలిపారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో ఆదివాసీ విభాగం ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి లింగంనాయక్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఆదివాసీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఏఐసీసీ ట్రైనర్ రాహుల్‌బాల్, ఉమ్మడి జిల్లా శిక్షణ ఇన్‌చార్జి కోట్యనాయక్, రాష్ట్ర కోఆర్డినేటర్ గణేష్‌నాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment