ప్రమాద ఘంటికలు | - | Sakshi
Sakshi News home page

ప్రమాద ఘంటికలు

Published Sat, Feb 8 2025 12:29 AM | Last Updated on Sat, Feb 8 2025 12:29 AM

ప్రమా

ప్రమాద ఘంటికలు

శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల్లో అడుగంటిన జలాలు

పోటాపోటీగా తరలింపుతో వేసవికి ముందే భారీగా తగ్గిన నీటిమట్టం

మరో నెలరోజుల్లోనే డెడ్‌ స్టోరేజీకి రెండు ప్రాజెక్టులు

ఇప్పటికే యాసంగి పంటలకు వారబందీ పద్ధతిలో సాగునీరు

అప్రమత్తం కాకపోతే తాగునీటికీ తిప్పలే

సాక్షి, నాగర్‌కర్నూల్‌: వేసవికి ముందే శ్రీశైలం, జూరాల జలాశయాల్లో నీటినిల్వలు భారీ స్థాయిలో అడుగంటుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత వేగంగా నీటిమట్టం పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా వేసవి సమీపించక ముందే ఈ రెండు జలాశయాలు సగానికి ఖాళీ అయ్యాయి. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 84.66 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. శ్రీశైలం డ్యాంలోని నీటిని వివిధ సాగునీటి ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి కోసం ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా వినియోగించుకోవడంతో ప్రస్తుతం జలాశయం నీరు సగానికి మించి అడుగంటింది.

మేలుకోకుంటే ముప్పే..

ఈసారి కృష్ణానదికి భారీస్థాయిలో వరదలు రావడంతో శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులు నీటితో కళకళలాడాయి. శ్రీశైలం నుంచి ఏపీ, తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులతో పాటు సుమారు 3 నెలల పాటు ఇరురాష్ట్రాలు విద్యుదుత్పత్తి కోసం నిరంతరం నీటిని వినియోగించాయి. ఏపీ కోసం హంద్రీనీవా సుజలా స్రవంతి, మల్యాల కేసీసీ, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడుహెడ్‌రెగ్యులేరీ ద్వారా నీటిని విడుదల చేయగా.. తెలంగాణలోని ఎంజీకేఎల్‌ఐకి నీటిని వినియోగించారు. వీటితో పాటు ఇరు రాష్ట్రాల జల విద్యుత్‌ కేంద్రాల్లో నిత్యం సుమారు 2 నుంచి 3 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ఫలితంగా రెండు నెలల్లోనే జలాశయం నీటిమట్టం సగానికి మించి పడిపోయింది. మరో నెల రోజుల్లోనే డెడ్‌ స్టోరేజీ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఇదే తీరు కొనసాగితే వేసవిలో తాగునీటి సరఫరాకు సైతం ఇబ్బందులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు.

డెడ్‌ స్టోరేజీకి నీటినిల్వ..

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నీటినిల్వ రోజురోజుకూ తగ్గిపోతోంది. ప్రస్తుతం జలాశయంలో కేవలం 5.287 టీఎంసీల నీరు ఉండగా.. కేవలం 1.58 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నీటితోనే ఆయకట్టు కింద యాసంగి పంటలకు వారబందీ పద్ధతిలో సాగునీరు అందించడంతోపాటు తాగునీరు అందించడం కష్టసాధ్యంగా మారింది.

శ్రీశైలం జలాశయంలో

ప్రస్తుత నీటిమట్టం ఇలా..

తాగునీటికి ప్రణాళిక..

వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కోసం ప్రణాళికను సిద్ధం చేశాం. శ్రీశైలం రిజర్వాయర్‌లో ఇకపై విద్యుదుత్పత్తి చేపట్టకుండా.. నీటిని నిల్వ ఉంచేందుకు ప్రభుత్వానికి లేఖ రాస్తాం. డ్యాంలో 40 టీఎంసీల నీటిమట్టం వరకు తాగునీటి వినియోగానికి వీలు ఉంటుంది.

– శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ, నీటి పారుదల శాఖ

4 టీఎంసీలపై ఆశలు..

జూరాల డ్యాంలో నీరు భారీస్థాయిలో పడిపోవడంతో వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపూర్‌ జలాశయం నుంచి కనీసం ఐదు టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేయాలని ఆ రాష్ట్రాన్ని ఇటీవల ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విన్నవించారు. ఉమ్మడి జిల్లా తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని 4 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని కర్ణాటక ప్రభుత్వం నుంచి సంకేతాలు అందాయి. ఇప్పటికే జూరాల జలాశయంలోని నీరు కనిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో నారాయణపూర్‌ నుంచి నీటి విడుదలపై ఆశలు నెలకొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రమాద ఘంటికలు 1
1/1

ప్రమాద ఘంటికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement