దరఖాస్తు చేసుకోవాలి
న్యూశాయంపేట : తెలంగాణ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఉచిత కుట్టు మిషన్లు అందజేయనున్నట్లు హనుమకొండ, వరంగల్ జిల్లాల మైనార్టీ సంక్షేమ అధికారులు డి.మురళీధర్‌రెడ్డి, టి.రమేశ్‌లు సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులను టీజీఓబీఎంఎంఎస్.సీజీజీ.జీఓవీ.ఇన్‌లో ఈనెల 20లోగా సమర్పించాలన్నారు. వివరాలకు హనుమకొండ జిల్లా వాసులు సుబేదారిలోని కలక్టరేట్ కాంప్లెక్స్ 2వ అంతస్తు, వరంగల్ జిల్లా వాసులు సుబేదారి సర్క్యూట్ హౌజ్ రోడ్, షరీఫన్ మజీద్ ఎదురుగా, అపోలో ఫార్మసీ పక్కన 2వ అంతస్తులో గల మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు.
25నుంచి కేయూ పీజీ
మూడో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల (నాన్ ప్రొఫెషనల్) మూడో సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) ఈనెల 25వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బీఎస్‌ఎల్ సౌజన్య సోమవారం తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం తదితర పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్‌ను విడుదల చేశారు. పరీక్షలు ఈనెల 25, 27, 29, 31, ఫిబ్రవరి 3, 5 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని తెలిపారు. పూర్తి వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయిలో
ఉత్తమ ప్రతిభ కనబర్చాలి
విద్యారణ్యపురి : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని పొలేపల్లి సెజ్ ప్రాంగణంలో మంగళవారం నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ మనాక్ పోటీలకు జిల్లానుంచి విద్యార్థులు, గైడ్ టీచర్లు తరలివెళ్లారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో ఏడుగురు చొప్పున విద్యార్థులు, ఇన్‌స్పైర్ మనాక్‌లో జిల్లా నుంచి 12 మంది విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. సైన్స్ సెమినార్‌కు ఒకరు ఎంపికయ్యారు. వీరితోపాటుగా గైడ్‌టీచర్లు కలిసి సోమవారం హనుమకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాల నుంచి వాహనంలో బయలుదేరివెళ్లారు. వారిని డీఈ ఓ వాసంతి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ గుగులోత్ నెహ్రూనా యక్, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి, మడికొండ జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం సంధ్యారాణి, ఉపాధ్యాయులు దయాకర్, ఎ.సంపతి, రామనాథం, ప్రశాంతి పాల్గొన్నారు.
నిట్‌తో బీఐఎస్ ఒప్పందం
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌తో బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్) సోమవారం పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది. బీఐఎస్ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర వినియోగదారుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో వరంగల్ నుంచి నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సబుదీ ఆన్‌లైన్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి నిధి ఖారే, బీఐఎస్ డీజీ ప్రమోద్ కుమార్ తివారి, హైదరాబాద్ శాఖ డైరెక్టర్ పీవీ. శ్రీకాంత్, నిట్ ప్రొఫెసర్లు శ్రీనివాసచార్య, రతిష్ కుమార్, వేణువినోద్, తదితరులు పాల్గొన్నారు.
9న మెగా జాబ్‌మేళా
విద్యారణ్యపురి : కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 9న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వారు మెగా జాబ్‌మేళాను నిర్వహించబోతున్నారని హనుమకొండ జిల్లా డీఐఈఓ ఎ.గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023–24లో బీటెక్ బీ–ప్రోగ్రాం పూర్తి చేసినవారు, ఈ ఏడాదిలో ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, బైపీసీ, ఒకేషనల్ కంప్యూటర్ విద్యార్థులకు ఈనెల 9న ఉదయం 9గంటలకు జాబ్ మేళాను నిర్వహిస్తారని వివరించారు. పూర్తి వివరాలకు హెచ్‌సీఎల్ ప్రతినిధి 75691 77071, 79818 34205 నంబర్‌లో సంప్రదించాలని డీఐఈఓ కోరారు.
ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో..
కాళోజీ సెంటర్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసేందుకు జాబ్‌మేళా ఇంటర్వ్యూలు ఈ నెల 9న (గురువారం) నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సీహెచ్ ఉమారాణి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ములుగురోడ్డు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఉదయం 10.30గంటలకు హాజరు కావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment