పకడ్బందీగా సర్వే చేపట్టాలి
● రాష్ట్ర హౌజింగ్ బోర్డు ఎండీ గౌతమ్
● నగరంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తనిఖీ
వరంగల్ అర్బన్ : ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని, తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలని రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. వరంగల్ 29వ డివిజన్‌లోని రామన్నపేటలో జరుగుతున్న సర్వేను సోమవారం గౌతమ్, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలు క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ.. సర్వే చేస్తున్న క్రమంలో లబ్ధిదారులు అందించే ధ్రువపత్రాల్లో ఉన్న సమాచారాన్ని క్రమపద్ధతిలో నమోదు చేయాలన్నారు. అనంతరం హనుమకొండ ఐడీఓసీలోని మినీ సమావేశ మందిరంలో సర్వే పురోగతిపై సమీక్షించారు. ఇప్పటివరకు బల్దియా పరిధిలో పూర్తయిన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ కమిషనర్లు మాట్లాడుతూ ఇప్పటివరకు 90శాతం సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. కొన్ని దరఖాస్తుల్లో వార్డు నంబర్లు తప్పుగా నమోదు అయినట్లు గుర్తించామని, వాటిని సవరించడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరగా త్వరలో ఇస్తామని ఎండీ గౌతమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ సీఈ చైతన్య కుమార్, డిప్యూటీ కమిషనర్లు కృష్ణారెడ్డి, రవీందర్, ఆర్‌ఐ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment