ఆదర్శ నగరంగా వరంగల్
హన్మకొండ అర్బన్: రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా పేరున్న వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధి లక్ష్యంగా భద్రకాళి బండ్, టెక్స్‌టైల్ పార్క్, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పథకాలకు భారీగా నిధులను కేటాయించామన్నారు. హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చే టెక్నాలజీని వెంటనే వరంగల్‌లోనూ తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 తగ్గకుండా మొదటి విడతలో ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఈ సంక్రాంతి పండుగ నాటికి ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జనవరి 26వ తేదీ నుంచి రైతుభరోసా పథకాన్ని ప్రారంభిస్తామని, భూమిలేని పేదలకు కూడా ప్రతీ ఏడాది రూ.12వేలు అందిస్తామని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు ఆర్టీసీని ఆధునీకరిస్తున్నామని, అందులో భాగంగా ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్నారు. ఎలక్ట్రికల్ బస్సులు నిరంతర ప్రక్రియగా ఆర్టీసీకి అందజేస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment