జాతర భక్తులకు సంతృప్తి కలగాలి
ఐనవోలు : లక్షలాదిగా తరలివచ్చే మల్లన్న జాతరను ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, ఎండోమెంట్ అధికారులు సమష్టిగా పనిచేసి జాతరకు వచ్చేవారికి ఇబ్బందులు కలుగకుండా సంతృప్తి కలిగేలా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, మంచినీటి వసతి, పారిశుద్ధ్యం, క్యూలైన్లను క్రమబద్ధీకరించి అందులో వేచి ఉన్న భక్తులకు మంచినీటి వసతి, మహిళా భక్తుల సౌకర్యార్ధం జల్లు స్నానాలు, డ్రస్ చేంజింగ్ రూములు, ఆరోగ్యశిబిరాలు ఏర్పాటు తదితర అంశాలపై దృష్టి సారించాలి. పోలీస్, విద్యుత్, హెల్త్, రెవెన్యూ, మండలపరిషత్, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఆర్‌అండ్‌బీ, పీఆర్, ఆర్టీసీ, ఎకై ్సజ్, ఫైర్, ఐబీ తదితర శాఖల అధికారులు ఎండోమెంట్ అధికారులతో సమస్వయం చేసుకుంటేనే జాతర విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంక్రాంతి రోజు జరిగే పెద్దరథం నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యువతను కంట్రోల్ చేయడం, శివరాత్రి రోజు పెద్దపట్నం వేసినప్పుడు తొక్కిసలాట జరుగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కొబ్బరి కాయలు, పూజా సామగ్రి ధరలు సాధారణ స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
12 నుంచి జాతర ప్రారంభం
ఈ నెల 12 నుంచి జాతర ప్రారంభం కానుంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్ని అంశాలపై సమీక్షిక్షించి కనీసం తాత్కాలిక ప్రాతిపదికనైనా అన్ని ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. అలాగే జిల్లా ఉన్నతాధికారులు ఎండోమెంట్ అధికారులతో సమన్వయం చేసుకునేలా ఎమ్మెల్యే దిశా నిర్థేశం చేయాల్సి ఉంది.
రూ.50 కోట్లు మంజూరు చేయించాలి
శతాబ్ధాల చరిత్ర కలిగిన మల్లన్న ఆలయానికి కనీసం రూ.50 కోట్లు మంజూరు చేయించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ తూర్పు, దక్షిణం వైపు ఉన్న కీర్తితోరణాలు శిథిలం కాగా వాటికి మరమ్మతులు చేపట్టాలి. ఆర్కియాలజీ శాఖ సహకారంతో పడమర వైపు నాలుగో కీర్తి తోరణం ఏర్పాటు చేయాలి. ఒగ్గు పూజారులకు వసతి, కల్యాణ కట్ట నిర్మించాల్సి ఉంది. కాగా ఇటీవల ఊరగుట్టపై ఆలయం తరపున కార్తీక మాసంలో అఖండ దీపం వెలిగిస్తున్నారు. ఊరగుట్ట కింద ఉన్న చెరువును అభివృద్ధిపర్చి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష భక్తుల్లో ఉంది.
మల్లన్న ఆలయంలో నేడు సమీక్ష సమావేశం
హాజరు కానున్న ఎమ్మెల్యే కేఆర్
నాగరాజు, ఎంపీ కడియం కావ్య
అభివృద్ధిపై దృష్టి సారించాలని
భక్తుల వేడుకోలు
నేడు సమీక్ష
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో నేడు (మంగళవారం) మల్లన్న జాతరపై మధ్యాహ్నం ఒంటిగంటకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు, అలాగే దాతల సహకారంతో రూ.16.99 లక్షలతో పున్నేలు క్రాస్ వద్ద నూతనంగా నిర్మించిన డబుల్ ఆర్చ్‌గేట్‌ను ప్రారంభిస్తున్నటు ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్య అఽతిథులుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నట్లు తెలిపారు. 1971లో నిర్మించిన సింగిల్ ఆర్చ్‌గేట్‌ను సోమవారం సాయంత్రం హూటాహుటిన అధికారులు కూల్చివేశారు.
Comments
Please login to add a commentAdd a comment