![అను మృతదేహం - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/3/02pnm56_mr.jpg.webp?itok=moYZqt0C)
అను మృతదేహం
భీమవరం: నకిలీ బంగారాన్ని విక్రయించి ఒక మహిళ మోసం చేసిందంటూ వ్యాపారి చేబ్రోలు విజయ్‌కుమార్ ఫిర్యాదు చేశారని వన్‌టౌన్ ఎస్సై ఎన్.హనుమంతరావు చెప్పారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కురిశేటి వారి వీధిలోని ఒక దుకాణానికి మూడేళ్ల బాలుడితో ఒక మహిళ వచ్చి, పిల్లవాడి మురుగులు సరిపోవడం లేదని విక్రయిస్తునాన్నంటూ దానికి సరిపడా విలువ గల గొలుసు ఇవ్వాలని వ్యాపారిని కోరింది. ఆ మురుగులపై 916 కేడీఎం హాల్ మార్క్ కలిగి ఉండడంతో విజయ్‌కుమార్ నమ్మారు. ఆమె వెళ్లిన తర్వాత వాటిని పరిశీలించగా ప్లేటెడ్ బంగారమని గుర్తించారు. డిసెంబర్ 28న ఈ సంఘటన జరగ్గా సోమవారం ఫిర్యాదు అందిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కాగా మోసగించిన మహిళ ఉభయగోదావరి జిల్లాల్లోని సుమారు 50 మంది వ్యాపారులను మోసగించినట్లు తెలుస్తోంది.
నారాయణ కళాశాలలోవిద్యార్థిని ఆత్మహత్య
పెనమలూరు: కానూరులోని నారాయణ కళాశాలలో మంగళవారం ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెనమలూరు సీఐ టీవీవీ రామారావు కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన బి.సురేష్, రేచల్‌కుమారి దంపతుల కుమార్తె బి.అను (17) కానూరు నారాయణ మెడికల్ అకాడమీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వచ్చిన అనును సెలవులు ముగియటంతో తల్లి రేచల్‌కుమారి మంగళవారం సాయంత్రం కాలేజీలో దించి వెళ్లింది. అయితే హాస్టల్ రూమ్‌లోకి వెళ్లిన అను తిరిగి రాకపోవటంతో సహచర విద్యార్థినులు వెళ్లి చూడగా ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఆమెను కళాశాల అధికారులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఉయ్యూరు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment