నిరసన గళం
●
బకాయి జీతాలు చెల్లించాలి
108 ఉద్యోగుల శ్రమను గుర్తించి వారి డిమాండ్‌లు పరిష్కరించాలి. సకాలంలో జీతాలు ఇవ్వడం, 108 ఉద్యోగులు వేగంగా వెళ్లే సమయంలో ఏదైన జరిగితే ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం, ప్రభుత్వమే నేరుగా 108 వ్యవస్ధను నడపాలని కోరుతున్నాం. జీతాలు బకాయిలు పెట్టడం వల్ల ఇబ్బంది పడుతున్నాం.
– బి.రత్న సాగర్, 108 ఉద్యోగుల జిల్లా జనరల్ సెక్రటరీ
ఉద్యోగ భద్రత కల్పించాలి
వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. నాలుగు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి. హెచ్‌ఆర్ పాలసీ, గ్రూప్ బీమా సౌకర్యం కల్పించాలి. వారికి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. ముఖ్యంగా రాజకీయ వేధింపులు ఆపాలి, అక్రమ తొలగింపులు నిలుపుదల చేయాలి.
– ఎ.నిర్మలదేవి, వీఓఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు
సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వం, అధికారులు అప్పగించే ప్రతి పనిని నిర్వర్తిస్తున్న ఆశలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. కనీస వేతనం, ఉద్యోగ భద్రత ఉండాలి. కింది స్థాయి అధికారుల ఒత్తిడి, రాజకీయ వేధింపులకు గురవుతున్నారు. ఈ సమస్యపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి.
–డి.జ్యోతి, ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా సెక్రటరీ
భీమవరం (ప్రకాశం చౌక్) : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో తమకు ఇచ్చిన హమీలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలంటూ పలు వర్గాలు నిరసన గళమెత్తాయి. భవన నిర్మాణ కార్మికుల నుంచి అంగన్‌వాదీలు, ఆశా వర్కర్లు, వీఓఏలు, 108 ఉద్యోగుల వరకు కలెక్టరేట్‌లో ధర్నాలు, నిరసనలతో గళమెత్తుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హమీలు అమలు చేయడం లేదు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటుతున్నా హమీలపై స్పందించడం లేదు. దీంతో విసుగు చెందిన ఉద్యోగులు, కార్మికులు ధర్నాలు, సమ్మె బాట పడుతున్నారు. కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నారు.
ఆశ వర్కర్ల ఆందోళన
గత ప్రభుత్వం ఆశల సమస్యలపై చర్చించి రాతపూర్వకంగా ఇచ్చిన మినిట్స్ అమలు చేయాలని కోరుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఇచ్చిన సర్క్యులర్‌లో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని వాటిని సరిచేయాలని, ప్రభుత్వ నిబంధనలు అమలు చేయడంలో గందరగోళ పరిస్థితి ఉందని చెబుతున్నారు. కనీస వేతనాలు చెల్లించాలని రూ. 60 వేలు రిటైర్‌మెంట్ బెనిఫిట్ జీవో అమలు చేయాలని, గ్రూపు బీమా, 62 ఏళ్లకు వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
హామీలు అమలు చేయాలి: వీఓఏలు
వెలుగు విభాగంలో పనిచేస్తున్న వీఓఏ(యానిమేటర్స్)లు అనేక సమస్యలపై నిరసన గళం వినిపించారు. ప్రభుత్వం వారికి నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. జీతాలు చెల్లించాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీ ప్రకారం కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలని, అక్రమంగా తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకొవాలని కోరుతున్నారు. మహిళా మార్ట్‌ల్లో బలవంతపు సరుకుల కొనుగోళ్లు ఆపాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు, గ్రూపు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికుల ఇక్కట్లు
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇసుక పాలసీ మారుస్తామని హమీ ఇచ్చింది. ఆ హమీ అమలు చేసి ఉచిత ఇసుక అందించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 5 నెలలుగా ఇసుక లేక భవన నిర్మాణ రంగం కుదేలైంది. కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక సరఫరా సక్రమంంగా చేయాలని, ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం లేకుండా ఇసుక సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సమ్మెకు వెళ్లే యోచనలో 108 ఉద్యోగులు
తమ సమస్యలు పరిష్కరించాలని 108 ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 25 దాటిన తర్వాత సమ్మెకు వెళ్లే అవకాశం ఉంది. 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, 8 గంటల పనివిధానం అమలు చేయాలని కోరుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన జీవో 49ను అమలు చేయాలని, 108కు శాశ్వత భవనాలు, బకాయి ఉన్న జీతాలు చెల్లించాలని, 25 లక్షల ఎక్స్‌గ్రేషియా తదితర డిమాండ్లు చేస్తున్నారు.
సమాన వేతనాలు అందించాలి: మినీ అంగన్‌వాడీలు
మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తల మాదిరిగా అన్ని పనులు చేస్తున్న తమకి వారితో సమానంగా వేతనాలు అందించాలని.. పదోన్నతులు కల్పించాలని.. తమ సెంటర్లును మెయిన్ సెంటర్లుగా మార్పు చేసి జీవో ఇవ్వాలని, సూపర్‌వైజర్ పోస్టులకు అర్హత కల్పించాలని మినీ అంగన్‌వాడీలు డిమాండ్ చేస్తున్నారు.
ఆందోళన బాటలో భవన నిర్మాణ కార్మికులు, ఆశా వర్కర్లు, వీఏఓలు, 108, అంగన్‌వాడీ సిబ్బంది
ఎన్నికల ముందు హామీలు నెరవేర్చాలి
ఆరు నెలలు గడుస్తున్నాస్పందించని ప్రభుత్వం
కలెక్టరేట్ వేదికగా ధర్నాలు, నిరసనలు
Comments
Please login to add a commentAdd a comment