బాబోయ్ చలి.. జాగ్రత్తలు తప్పనిసరి
భీమవరం (ప్రకాశం చౌక్)/భీమడోలు : చలి పులి ప్రజలను భయపెడుతుంది. గత మూడు రోజులుగా క్రమేపి రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాయంత్రం 5 గంటలకే వాతావరణం పూర్తిగా చల్లబడిపోతుంది. దీంతో ప్రజలు సాయంత్రం నుంచి బయటకు తిరగడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో చలి వల్ల జలుబు, శ్యాస కోశ సంబధిత వ్యాధులు, జ్వరాల బారిన పడే అవకాశం ఉందని, చిన్నారులు, వృద్ధులు, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు చలి నుంచి రక్షించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. కోవిడ్ సోకి బయట పడిన వారు ఈ చలి కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ముఖ్యంగా చలికాలంలో శ్వాస నాళాలు ముడుచుకుపోయే అవకాశం ఉంటుందని, గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుందని తగిన జాగ్రత్తలు, రక్షణ చర్యలు తీసుకుంటే చలి నుంచి రక్షించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా...
● శీతాకాలంలో చర్మం పొడి బారిపోతుంటుంది. మాయిశ్చరైజర్లు తప్పనిసరిగా వినియోగించాలి.
● చలికాలంలో చాలామంది నీరు తాగడం తగ్గిస్తారు. అలా చేయకూడదు. తగిన మోతాదులో మంచినీళ్లు తీసుకోవాలి.
● ఐస్‌క్రీమ్‌లు, చల్లని నీరు, చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి.
● వేడి ఆహారం తీసుకోవాలి. నిల్వ ఉన్న ఆహారం, మాంసాహారం బాగా తగ్గించాలి.
● గోంగూర, వంకాయ, కొబ్బరికాయ పడినవారు ఈ కాలంలో తినడం తగ్గించాలి.
● ఎండు చేపలు తినడం మానేయాలి. దీనిలో అధికంగా ఉండే ఉప్పు ఇబ్బందికరంగా మారుతుంది.
● దుమ్ము, ధూళి ఉండే ప్రాంతాలకు దూరం ఉండాలి. చలిగాలుల్లో తిరగకుండా ఉండడం మంచిది.
● ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్ ఏడాదికి ఒకసారి, న్యూమోనియా వ్యాక్సిన్ ఐదేళ్లకు ఒకసారి వైద్యుల సూచనలతో వేసుకుంటే మంచిది.
● ఇండోర్ వ్యాయామం, జిమ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి.
● వృద్ధులు, పిల్లలు చలిలో తిరగకుండా చూడాలి.
● రాత్రిళ్లు చలిలో ప్రయాణాలు చేయరాదు. అత్యవసరం అయితే వేడిని శరీరానికి అందించే ఉన్ని దుస్తులు ధరించాలి.
● ఇంటిలో ఎవరికై నా జలుబు, దగ్గు వస్తే వైద్యుల సూచనలతో మందులు వాడాలి. సొంత వైద్యం సరికాదు. కుటుంబంలో ఒకరికి వాడే ఔషధాలు వేరొకరికి వినియోగించడం సరికాదు.
● శీతాకాలంలో శ్వాస సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
జాగ్రత్తగా ఉండాలి
శీతాకాలంలో జాగ్రత్తగా ఉండాలి. చలి నుంచి శరీరాన్ని రక్షించుకోవాలి. ఈ కాలంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే సీ విటమిన్ కలిగిన పదార్థాలు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తీసుకుంటే మంచిది. ముఖ్యంగా గతంలో కోవిడ్ బారినపడిన వారు, శ్యాసకోశ వ్యాధులు, గుండె సమస్యలు ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్య వస్తే వెంటనే స్థానిక పీహెచ్‌సీ, లేదా ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందాలి.
– డాక్టర్ డి.మహేశ్వరరావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment