కార్గో సేవల ఆదరణకు చర్యలు
నూజివీడు: ప్రజా రవాణా సంస్థ(ఆర్టీసీ) అందిస్తున్న కార్గో సేవలపై ప్రజల్లో ఆదరణ పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కార్గో సర్వీసుల ద్వారా మరింత ఆదాయం పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రగతి రథ చక్రం ప్రజా రవాణా సంస్థను బలోపేతం చేసేందుకు అనేక విప్లవాత్మకమైన విధానాలను అమలులోకి తీసుకువచ్చింది. సంస్థకు వచ్చిన నష్టాలను తగ్గించుకోవడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా కొరియర్, కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేగాకుండా మరింత ఆదాయం పొందడంలో భాగంగా కార్గో రవాణాను నగరాల్లో డోర్ డెలివరీ సదుపాయాన్ని సైతం ప్రవేశపెట్టింది. దీంతో ఏడాదికేడాదికి కార్గో సేవల ద్వారా ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణాల్లో సైతం డోర్ డెలివరీని అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
జనవరి 19 వరకు స్పెషల్ డ్రైవ్
ఇప్పటివరకు తమకు వచ్చిన పార్శిళ్లను తీసుకెళ్లాలంటే బస్టాండ్‌లోని కొరియర్ పాయింట్‌కు వచ్చి వాటిని తీసుకెళ్లాల్సి వస్తోంది. ఆర్టీసీ డిపోలు ఉన్న దగ్గర కార్గో సర్వీసు ద్వారా వచ్చిన పార్శిళ్లు, కొరియర్ కవర్లను పది కిలోమీటర్ల వరకు ఉచితంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంత ప్రజల్లో దీనిపై పెద్దగా అవగాహన లేకపోవడంతో మరింత అవగాహన పెంచేందుకు గాను ఈనెల 20 నుంచి జనవరి 19 వరకు డోర్ డెలివరీ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఆర్టీసీ నిర్వహించనుంది. దీనికి తోడు డిక్కీ బుకింగ్ సేవలను కూడా అందుబాటులోకి తెస్తోంది. దూర ప్రాంతాలకు జామకాయలు, పూలు, కూరగాయలు తదితర వాటితో పాటు సామగ్రిని సైతం రవాణా చేసేందుకు డిక్కీ సేవలను ఉపయోగించుకోవచ్చు.
ఆదాయం పెరుగుదలలో భీమవరం ఫస్ట్
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు డిపోలున్నాయి. ఏలూరు జిల్లాలో నూజివీడు, ఏలూరు, జంగారెడ్డిగూడెం, పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, నర్సాపురంలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏలూరు జిల్లాలోని మూడు డిపోల నుంచి ఇప్పటి వరకు రూ.2.60 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు డిపోల నుంచి రూ.4.45 కోట్లు ఆదాయం వచ్చింది. ఆదాయం పెరుగదలలో భీమవరం డిపో ముందంజలో నిలిచింది.
ఆర్టీసీ కార్గో
సర్వీసు వాహనం
2024 ఏప్రిల్ నుంచి ఈనెల 16 వరకు
డిపోల వారీగా వచ్చిన కార్గో ఆదాయ వివరాలు
డిపో కార్గో ఆదాయం
నూజివీడు రూ.40 లక్షలు
ఏలూరు రూ.1.45 కోట్లు
జంగారెడ్డిగూడెం రూ.76 లక్షలు
భీమవరం రూ.1.17 కోట్లు
తాడేపల్లిగూడెం రూ.1.43 కోట్లు
తణుకు రూ.1.04 కోట్లు
నర్సాపురం రూ.81 లక్షలు
పట్టణాల్లో నేటి నుంచి డోర్ డెలివరీ సేవలు
నెలరోజుల పాటు స్పెషల్ డ్రైవ్
ఇకపై డిక్కీ బుకింగ్‌లకు అవకాశం
కార్గో ఆదాయం పెంచేందుకు కృషి
ఆర్టీసీలో కార్గో ఆదాయం పెంచేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈనెల 20 నుంచి వచ్చే నెల 19 వరకు కార్గో హోం డెలివరీ ప్రత్యేక డ్రైవ్ మాసోత్సవాలను నిర్వహించనున్నాం. కార్గో ఏజెంట్లను సైతం నియమించి ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. డిక్కీ బుకింగ్‌లకు సైతం అవకాశం కల్పిస్తున్నాం.
– జీ లక్ష్మీప్రసన్న వెంకట సుబ్బారావు, కార్గో మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment