కూటమి వాత.. ప్రజల వ్యథ
● ఉచిత ‘కార్పొరేట్’ విద్యకు మంగళం!
● ఉచిత ప్రవేశాలు పొందినా ఫీజులు చెల్లించాల్సిందే..
● పాఠశాలల యాజమాన్యాల ఒత్తిడి
● విద్యాహక్కు చట్టానికి తూట్లు
● ఉచిత ప్రైవేట్ విద్యకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు
● 1వ తరగతిలో ప్రవేశాలకు 25 శాతం సీట్ల కేటాయింపు
● పట్టించుకోని కూటమి ప్రభుత్వం
సాక్షి, భీమవరం : నీకు పదిహేను వేలు.. నీకు పది హేను వేలు.. నీకు పదిహేను వేలు అన్నారు.. తల్లికి వందనంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామంటూ ఎడాపెడా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తకుండా పేదలపై ఫీజుల భారం మోపారు. పైసా ఖర్చులేకుండా పేదల పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో విద్యనందించాలన్న ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. విద్యారంగాని కి పెద్దపీట వేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలపై ఫీజుల భారం పడకుండా ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే వీలు కల్పించారు. ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం సెక్షన్–12(1), (సి)ను అనుసరించి ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 1వ తరగతిలో 25 శాతం సీట్లు పేద విద్యార్థుల కోసం కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఐదేళ్లు నిండి ఆరేళ్లలోపు పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తూ అందుకు అర్హతగా విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.14 లక్షలలోపు ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు స్కూల్ యాజమాన్యాలకు ఏడాదికి అర్బన్ ఏరియాలో రూ.8,000, రూరల్‌లో రూ.6,500, ఏజెన్సీ ప్రాంతంలో రూ.5,500 ఫీజుగా నిర్ణయించారు. అయితే విద్యార్థి తల్లిదండ్రులు చెల్లించలేని పక్షంలో వారికందించే అమ్మఒడి సాయం నుంచి ఈ మేరకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఫీజు పోను మిగిలిన సొమ్మును విద్యార్థి తల్లి ఖాతాకు జమచేసేలా చర్యలు తీసుకుంది.
జిల్లాలోని 383 పాఠశాలల్లో..
జిల్లాలో 383 ప్రైవేట్ పాఠశాలలకుగాను 1వ తరగతిలోని వాటి సీట్ల సంఖ్యలో 25 శాతం ప్రభుత్వం కల్పించే ఉచిత విద్యకు కేటాయించాల్సి ఉంది. ఈ విధానాన్ని 2022–23 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురాగా తొలి ఏడాది వివిధ ప్రైవేట్ విద్యాసంస్థల్లో 38 మంది విద్యార్థులు చేరారు. గత విద్యాసంవత్సరంలో అనూహ్యంగా 1,812 దరఖాస్తులు రాగా అర్హత కలిగిన 1,162కి ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య పొందే అవకాశం కల్పించారు.
పథకాలు రాక..
ఫీజులు కట్టలేక..
ఎంతమంది ఉంటే అందరు పిల్లలకు రూ.15 వేల చొప్పున ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు తల్లికి వందనం ఊసెత్తడం లేదు. సంక్షేమ పథకాల అమలు చేయడం లేదు. తల్లిదండ్రులు చెల్లించకుంటే గతంలో మాదిరి ప్రభుత్వం చెల్లిస్తుందన్న భరోసా కూడా ఇవ్వడం లేదు. సెక్షన్–12(1), (సి)కి వ్యతిరేకంగా ప్రైవేట్ విద్యాసంస్థలు కోర్టును ఆశ్రయించగా పేదలు నష్టపోకుండా కూటమి ప్రభుత్వం చొరవ చూపడం లేదు. దీంతో విద్యాసంస్థలు ఫీజుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజు మొత్తం చెల్లించాలని నోటీసులు ఇస్తున్నాయి. ఇప్పటికే నిర్ణీత ఫీజు చెల్లించిన వారికి మిగిలిన ఫీజు చెల్లించాలని, లేని వారిని మొత్తం ఫీజు చెల్లించాలని చెబుతున్నాయి. ఉచిత విద్య అందుతుందని ఆశతో తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన పేదవర్గాల వారు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అయినకాడికి అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment