శ్రీవారి దీక్ష.. సర్వ జగద్రక్ష
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో పెద్ద ఎత్తున భక్తులు గురువారం తెల్లవారుజామున గోవింద మాలను స్వీకరించారు. పెద్దలతో పాటు యువత, బాలలు సైతం ఈ అర్ధమండల దీక్షను చేపట్టారు. దీంతో గోవింద స్వాములతో శ్రీవారి క్షేత్రం కళకళలాడింది. ముందుగా ఆలయంలో దీక్షాధారుల మెడలో అర్చకులు మాలలను వేశారు. అనంతరం స్వాములు దీపారాధనలు చేసి, ప్రదక్షిణలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారి తొలిహారతిని అందుకున్నారు. ప్రతి ఏటా శ్రీవారి దీక్షను వందలాది మంది భక్తులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ద్వారకాతిరుమల పరిసర ప్రాంతాలతో పాటు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన భక్తులు అధికంగా ఈ దీక్షను చేపట్టారు. జనవరి 10న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని, స్వామివారి ఉత్తరద్వార దర్శనం చేసుకున్న అనంతరం వీరంతా ఇరుముడులు సమర్పించి, దీక్షను విరమిస్తారు.
దీక్ష స్వీకరించేది ఇలా..
శ్రీవారి క్షేత్రంలో చాతుర్మాస (108 రోజుల) దీక్ష, 7 శనివారాల వ్రత దీక్ష, మండల (41 రోజులు) దీక్ష, అర్ధమండల (21 రోజులు) దీక్షగా భక్తులు స్వీకరిస్తున్నారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో అనుకున్న సమయానికి మాల ధరించలేని భక్తులు 11 అలాగే 9 రోజుల దీక్షను చేపడతారు.
దీక్షాధారుల నిత్య కార్యక్రమాలు
తెల్లవారుజామునే చన్నీటి స్నానాన్ని ఆచరించి, పశుపు వర్ణ దుస్తులతో ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత స్వామివారి దీపారాధన మండపంలో స్వాములంతా దీపాలు వెలిగించి, పూజాధికాలు జరుపుతారు. ఆ తరువాత గోవిందనామాలు చదువుతూ తమ భక్తిని చాటుతారు. అనంతరం ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి, ఉదయం 6 గంటల సమయానికి చినవెంకన్నకు ఇచ్చే తొలి హారతిని చూసేందుకు క్యూకడతారు. అదే విధంగా సాయంత్రం సూర్యాస్తమయం తరువాత గోవింద స్వాములు ఆలయంలో పూజలు చేస్తారు.
ముక్కోటి ఏకాదశికి భక్తుల అర్ధ మండల దీక్షలు
గోవింద స్వాములతో క్షేత్రం కళకళ
జనవరి 10న ఇరుముడుల సమర్పణ
Comments
Please login to add a commentAdd a comment