కూటమి కరెంట్ షాక్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచమని, అవకాశం ఉంటే తగ్గించడానికి చూస్తామని వెళ్ళిన ప్రతీ చోటా చంద్రబాబు పదే పదే చెప్పారు. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలకు రెండుసార్లు షాక్ ఇచ్చారు. ఆరు నెలల కాలంలో రాష్ట్రం మొత్తం మీద గత నవంబర్‌లో రూ.6072.86 కోట్లు, డిసెంబర్‌లో రూ. 9412.50 కోట్లు కలిపి మొత్తం రూ.15485.36 కోట్లు ప్రజలపై భారం మోపారు. దీంతో ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పింది కల్లబొల్లి కబుర్లేనని స్పష్టమైంది. ఎన్నికల సమయంలో బాబు చెప్పిన ష్యూరిటీ బోగస్ అని, బాదుడు మాత్రం గ్యారెంటీ అని ప్రజలు చెబుతున్నారు. గత ప్రభుత్వం కొన్ని సాంకేతిక కారణాలతో అరకొరగా పెంచిన విద్యుత్ చార్జీలను భూతద్దంలో చూపిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై రూ.వేల కోట్ల భారాన్ని మోపారు. సంపద సృష్టి మాట అటుంచి ప్రజల కష్టార్జితాన్ని దోపిడీచేసే దిశగా బాబు విద్యుత్ చార్జీల పెంపు పిడుగును ప్రజల నెత్తిపై వేశారు. ఇప్పటికే పెంచిన చార్జీలను వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారు. గతంలో వచ్చిన బిల్లులను, కూటమి ప్రభుత్వం ఇస్తున్న బిల్లులను చూసి ప్రజలు హడలెత్తిపోతున్నారు. గతంలో రూ.300 బిల్లు వస్తే ఇప్పుడు దాదాపు రూ.375 వస్తోంది. పది శాతం మేర బిల్లులు అధికంగా వస్తుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంధన, విద్యుత్ కొనుగోలు పేరిట దెబ్బ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇస్తున్న విద్యుత్ బిల్లుల్లో ఎఫ్‌పీపీసీఏ చార్జీలు అని చేర్చారు. (ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్) ఇంధనం, విద్యుత్ కొనుగోలు ధరల సర్ధుబాటు చార్జీలన్నమాట. ఈ పేరుతో ప్రభుత్వం ప్రజలపై అదనపు చార్జీల ముసుగు దెబ్బ వేసింది. గత ప్రభుత్వం ప్రజలకు విద్యుత్ బిల్లులు భారం కాకూడదనే లక్ష్యంతో ఇంధనం, విద్యుత్ కొనుగోలు చార్జీలను విధించకుండా బిల్లులు జారీ చేసేది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకే కాక పరిశ్రమల వినియోగదారులకు కూడా బిల్లులు చెల్లించడం పెద్ద కష్టంగా అనిపించేది కాదు. గత ప్రభుత్వానికి భారం కాని కొనుగోలు చార్జీలు ఈ ప్రభుత్వానికి భారమైపోయాయా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మినహాయించిన చార్జీలను కూడా ఈ ప్రభుత్వం వసూలు చేస్తోంది. ప్రస్తుతం వస్తున్న బిల్లుల్లో 2022 – 23 సంవత్సరానికి సంబంధించి కొనుగోలు చార్జీల నిమిత్తం యూనిట్‌కు 58 పైసలు, తాజా 2024–25 సంవత్సరానికి సంబంధించిన కొనుగోలు చార్జీల నిమిత్తం యూనిట్‌కు మరో 40 పైసలను బిల్లుల్లో కలిపి జారీ చేస్తున్నారు.
యూనిట్‌పై రూ.1 అదనంగా వసూలు
ప్రభుత్వం వినియోగించిన విద్యుత్‌కు సంబంధం లేకుండా యూనిట్‌కు సుమారు రూ.1 అదనంగా వసూలు చేస్తోంది. మామూలుగా ఇన్ని యూనిట్లకు ఒక రేటు, అవి పెరిగితే మరో రేటు ఉండే యూనిట్ ధర శ్లాబు విధానంతో పని లేకుండా ఎన్ని యూనిట్లు కాల్చినా అన్ని యూనిట్లకు అదనంగా పెంచిన చార్జీలు చెల్లించాల్సిందే. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారం పడుతోంది. తక్కువలో తక్కువ చూసినా ప్రస్తుత రోజుల్లో సుమారు 150 యూనిట్ల విద్యుత్ వినియోగం సామాన్యమైపోయింది. 150 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తే శ్లాబు ప్రకారం బిల్లు ఎంత వచ్చినా.. దానికి అదనంగా మరో రూ.150 చెల్లించాల్సి వస్తోంది. విద్యుత్ బిల్లుల ఎగవేతదారుల వల్ల కలిగిన నష్టాన్ని సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పెట్టి భర్తీ చేసుకునేలా ప్రభుత్వం అడుగులు వేసింది.
ప్రజలపై విద్యుత్ చార్జీల పెంపు పిడుగు
యూనిట్‌పై అదనంగా రూపాయి వసూలు
ఇంధనం, విద్యుత్ కొనుగోలు పేరిట మరో వడ్డన
27న వైఎస్సార్‌సీపీ పోరుబాట
విద్యుత్ చార్జీల బాదుడుపై నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ ఈ నెల 27న పోరుబాట పట్టింది. ప్రతీ నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలుపుకుని ఆందోళనలు నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఏలూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment