వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పేదల ఆరోగ్యానికి పేదపీట
సాక్షి, భీమవరం : జిల్లాలోని ఆచంట, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం సీహెచ్‌సీల్లో ముఖ్యమంత్రి ఈ ఐ కేంద్రాల ద్వారా గత ప్రభుత్వం ఉచితంగా డీఆర్, గ్లకోమా, కేటరాక్ట్, తదితర వైద్యసేవలు అందించేవారు. అవసరమైన వారికి కళ్లజోళ్ల పంపిణీ, శస్త్రచికిత్సలు అందేవి. ఒక్కో కేంద్రంలో రోజుకు వందమందికి పైగా రోగులు కంటి వైద్యసేవలను ఉచితంగా పొందేవారు. ఈ కేంద్రాలను నిర్వహిస్తున్న కాంట్రాక్టు సంస్థతో మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) గడువు సెప్టెంబరు 4తో ముగిసింది. రెన్యువల్ దిశగా కూటమి చొరవ చూపక వీటి సేవలు నిలిచిపోయాయి.
వణికించిన వింత జ్వరాలు : ముందెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ద్వితీయార్ధంలో జిల్లా వాసులను విషజ్వరాలు వణికించాయి. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా ఎక్కడ చూసిన టైఫాయిడ్, మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాలు ప్రబలాయి. గత ఐదు నెలల్లో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పది వేలకు పైగా జ్వరాల కేసులు నమోదు కాగా ప్రైవేట్ ఆస్పత్రులు, పీఎంపీలను ఆశ్రయించిన వారి సంఖ్యకు లెక్కేలేదు. వైద్య గణాంకాల ప్రకారం ఈ సీజన్‌లో జూలై నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మలేరియా 139, డెంగీ 148, వైరల్ ఫీవర్ కేసులు 9,981 వచ్చాయి. వీరిలో డెంగీ బారిన పడిన ఐదేళ్ల లోపు చిన్నారులు ఏడుగురు ఉండగా, వైరల్ ఫీవర్ బారిన పడినవారు 1,145 మంది ఉన్నారు. వైరల్ జ్వరాల్లో ప్లేట్‌లెట్స్ పడిపోయేవి. నాలుగైదు రోజులు కోర్సు వాడాక తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెట్టేవి. మునుపెన్నడూ లేని విధంగా జ్వరం తగ్గినా కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు, కళ్లు , ముఖం ఉబ్బిపోవడం, చర్మంపై దద్దర్లు, రంగు మారిపోవడం, తదితర సమస్యలు వైద్యవర్గాలకు సవాల్‌గా మారాయి. కొద్దినెలలుగా ఆస్పత్రుల్లో పలు రకాల మందులు, హెచ్‌ఐవీ తదితర వ్యాధి నిర్ధారణకు సంబంధించిన కిట్ల కొరతతో రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
నిలిచిన మెడికల్ కళాశాల నిర్మాణం
పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడం, ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యంతో జిల్లాలోని పాలకొల్లులో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెడికల్ కళాశాల పనులు ముందుకు సాగడం లేదు. 60 ఎకరాల్లో రూ.475 కోట్లతో ఏడాది క్రితం పనులు చేపట్టగా ఎన్నికల సమయం నాటికి రూ.74.5 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. కూటమి వచ్చాక నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణ సంస్థ దాదాపు పనులు నిలిపివేసి నిర్మాణ సామాగ్రిని మరొక ప్రాంతానికి తరలించుకుపోయింది.
ఆరోగ్య ఆసరాతో
ధీమా
ఆనారోగ్య సమస్యతో ఆరోగ్యశ్రీలో శస్త్‌రత్రచికిత్స చికిత్స చేయించుకున్న రోగి కోలుకునే వరకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరాగా గత ప్రభుత్వం జీవన భృతి అందజేసేది. రోజుకు రూ. 275 చొప్పున సాయం లెక్కకట్టి అందించేవారు. మామూలు డెలివరీ, సిజేరియన్‌కు రూ.5000 చొప్పున, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి విరిగిన ఎముకలకు సర్జరీ రూ.10,000, కాళ్లకు ఇన్‌ఫెక్షన్ సంబంధించి సెల్యులైటీస్ కేసులు, కొన్ని కణుతుల చికిత్సకు రూ.1575, చెవి, గొంతు, ముక్కు సర్జరీలకు రూ.1,275, గుండె శస్త్రచికిత్సలకు రూ. 5 వేల నుంచి రూ. 10000 వరకు.. ఇలా ఆయా వ్యాధులను బట్టి సాయాన్ని వారు బ్యాంకు ఖాతాలకు జమచేసేవారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి మే నెలాఖరు వరకు జిల్లాలోని 21,248 మంది రోగులకు రూ.12.03 కోట్ల మొత్తాన్ని గత ప్రభుత్వం అందజేసింది.
కూటమి ప్రభుత్వంలో..
కూటమి అధికారంలోకి వచ్చాక ఆరోగ్య ఆసరా బిల్లుల చెల్లింపు ఆగిపోయింది. జూన్‌లో 4,623 మందికి రూ.2.59 కోట్లు, జూలైకు 4,915 మందికి రూ.2.81 కోట్లు బకాయిలు ఉండిపోయాయి. ఆగస్టు నెల నుంచి ఆసరా లబ్ధిదారుల వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది. దీంతో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఆరోగ్య సురక్షతో పేదల ముంగిటకే వైద్యం
గత ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత ఈ ఏడాది జనవరి 2 నుంచి మొదలైంది. ఆరు నెలల పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్య సేవల నిర్వహణకు షెడ్యూల్ ముందే నిర్ణయించడంతో ఎన్నికల సమయంలో, పూర్తయ్యాక కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించారు. రెండో దశలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 223, పట్టణ ప్రాంతాల్లో 69 శిబిరాలు నిర్వహించారు. 264 మంది స్పెషలిస్ట్ వైద్యులు, 132 మంది మెడికల్ ఆఫీసర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. రక్తం, మూత్రం, ఈసీజీ తదితర 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచి అవసరమైన వారికి అందజేసేవారు. 1,08,518 మందికి వైద్యసేవలు అందించి 350 మందిని శస్త్ర చికిత్సలకు సిఫార్సు చేశారు. కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 2006 మందికి ఉచిత కాటరాక్ట్ శస్త్రచికిత్సలు, 25,144 మందికి కళ్లజోళ్లు అందజేశారు.
కూటమి ప్రభుత్వంలో..
ఈ శిబిరాల నిర్వహణను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. మొన్నటి వరకు తమ సమీప ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ వైద్యసేవల్ని ఉచితంగా పొందిన గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పుడు వాటి కోసం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది.
పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసిన గత ప్రభుత్వం
పక్కాగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు
కూటమి ప్రభుత్వంలో నిలిచిన ఆరోగ్య సురక్ష, కంటి వెలుగు సేవలు
అందని ఆరోగ్య ఆసరా సాయం
ఈ ఏడాది జిల్లా వాసులను వణికించిన వింత జ్వరాలు
ఆస్పత్రుల్లో మందులు, రక్త పరీక్షల కిట్లకు కొరత
పాలకొల్లులో ముందుకు సాగని మెడికల్ కళాశాల పనులు
Comments
Please login to add a commentAdd a comment