పశువధ నిరసనలు..కూటమిలోకుంపట్లు!
తణుకు అర్బన్: ఒత్తిడి.. ఒత్తిడి అంటున్న అధికార యంత్రాంగం.. పశువధ కర్మాగార బాధితుల వ్యథను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో పశువధ కర్మాగారం లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిజాన్ని ఒప్పుకుంది. తేతలి గ్రామ పరిధిలో లాహం సంస్థ నిర్వహిస్తున్న పశువధ కర్మాగార రక్తపు మరకలు కూటమి ప్రభుత్వానికి అంటడంతో తేతలి గ్రామస్తులు, బాధితులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. ముఖ్యంగా కర్మాగారానికి రక్షణగా నిలుస్తున్న అధికార యంత్రాంగం తమకు పైనుంచి ఒత్తిడి ఉందంటున్న వ్యవహారం బట్టబయలైంది. తాజాగా ఆ సంస్థ జనరల్ మేనేజర్ అరవింద్ సరీన్ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం వ్యాపారం పెంచాలని తమపై ఒత్తిడి చేస్తుందని ఆయన బాహాటంగా అనడంతో అసలు విషయం తేటతెల్లమైంది.
కూటమిలో మల్లగుల్లాలు
తణుకు ఎమ్మెల్యే పశువధ కర్మాగారాన్ని మూయించే ప్రయత్నం చేయకపోవడంతో కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ కర్మాగా రం నుంచి తమకు ఎటువంటి వనరులు అందకపోయినా తమపై మచ్చ పడుతుందనే ఆందోళన ఆయా పార్టీల కేడర్‌లో వ్యక్తమవుతోంది. దీనికితోడు రోజురోజుకూ పశువధశాలపై వ్యతిరేకత పెరగడం, నిరసనలు మిన్నంటగా అఖిలపక్షం కూడా కార్యాచరణ ప్రకటించడం కూటమి నాయకులకు మింగుడు పడటం లేదు. అలాగే బీజేపీ, జనసేన తీరును కూడా బాధితులు తప్పుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ, జనసేన నాయకులు ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు.
మహిళల మండిపాటు
పశువధ శాల కారణంగా దుర్వాసనతో అల్లాడుతున్నామని, ఇళ్లల్లో ఉండలేకపోతున్నామంటూ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పట్టించుకోవడం లేదని బాధిత మహిళలు మండిపడుతున్నారు.
కర్మాగారాన్ని మూయాల్సిందే..
మన ఊరు, మన నేల, మన నీరు బావుండాలంటే తేతలిలో పశువధ శాల అనే కర్మాగారాన్ని పారదోలాల్సిందే. పచ్చని పంటలు పండే ఈ ప్రాంతంలో రక్తపాతం చిందిస్తున్న కర్మాగారాలు ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి కర్మాగారాల్లో ఇక్కడి కార్మికులకు ఉపాధి కూడా అవసరం లేదు. ఈ ప్రాంతవాసులకు తమ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకుని ఉండే హక్కు లేదా. దుర్మార్గులకు సెల్యూట్ చేస్తూ స్థానికులైన అమాయకులను ఇబ్బందులు పెట్టే రోజులు పోవాలి.
– కొండ్రెడ్డి శ్రీనివాస్, గోసేవా సమితి సభ్యుడు
తేతలిలో పశువధ పరిశ్రమపై పెరుగుతున్న వ్యతిరేకత
రోడ్డెక్కి నిలదీస్తున్న మహిళలు
కూటమి నేతల్లో మంటలు రాజేస్తున్న వైనం
జనసేన, బీజేపీ నేతల్లో అంతర్మథనం
Comments
Please login to add a commentAdd a comment